Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలంటూ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలంటూ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ చట్టం ఖచ్చితంగా అమలయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. మంగళవారం సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రైవేటు తో సహా అన్ని రకాల పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన చట్టం అమల్లో ఉందన్న సీఎం.. దీన్ని మరింత పగడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షలు చేసి ప్రతి ఆరు నెలలకోసారి నివేదికలు పంపాలని సూచించారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చే క్రమంలోనే పరిశ్రమలకు అన్నిరకాలుగా అండగా నిలుస్తున్నామన్నారు.
ఒక పరిశ్రమ సమర్థవంతంగా నడవాలంటే ఆ ప్రాంతంలోని స్థానికుల మద్దతు చాలా అవసరం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇప్పటికే ఏర్పాటైన, నిర్మాణంలో ఉన్న, రాబోతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నారు. సరిపడా మానవవనరులు రాష్ట్రంలో ఉన్నాయని.. నైపుణ్యాభివృద్ధికి కొదవ లేదని జగన్ పేర్కొన్నారు.