YS Family: రచ్చకెక్కిన వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు.. జగన్ నోటీసుల వెనక రాజకీయం ఉందా?
ANDHRAPATRIKA : – – ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ప్రత్యర్ధులుగా ఉన్న అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. తనకు తెలియకుండానే తన కంపెనీ షేర్లు బదలాయించారంటూ తన తల్లి విజయమ్మకు లీగల్ నోటీస్ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అదే సమయంలో ఆస్తుల పంపకం అగ్రిమెంట్ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు లేఖ రాయడంతో అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు చెల్లెలు. అయితే జగన్ నోటీసులు ఇవ్వడం వెనక రాజకీయం ఉందా? పాత కేసుల భయం దాగుందా? షర్మిలతో జగన్ చేసుకున్న ఒప్పందం ఏంటి? అన్నదీ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను ఇచ్చిన 1శాతం వాటా గిఫ్ట్ డీడ్‌ను తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని.. దీనిని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు మాజీ సీఎం జగన్. సరస్వతీ పవర్ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తికూడా అటాచ్మెంట్లోకి వెళ్లిపోయింది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
అయితే, తన చెల్లెలపై ప్రేమకొద్దీ రాసిన MOUలో సరస్వతీ సిమెంట్స్‌లో 49శాతం షేర్లు ఇస్తానని జగన్ చెప్పారు. నేరుగా షర్మిలకు బదిలీ చట్టవిరుద్ధం కాబట్టి, నమ్మకంకోసం అప్పటికే 1శాతం వాటాదారుగా ఉన్న తల్లికి ఇస్తానన్న ఈ షేర్లపై గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. కేసులు తేలాక షర్మిల పేరుమీద బదిలీ చేసుకోవచ్చని జగన్ ఈ గిఫ్ట్‌డీడ్‌ను 2019లోనే రాసిచ్చారు.
అయితే కోర్టు కేసుల్లో, అటాచ్మెంట్లో ఉన్న ఆస్తిని నిర్వహించుకోవడానికే తప్ప ఏరకంగానూ క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీల్లేదు. 2021లో సరస్వతీ పవర్లో జగన్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గరనుంచి షేర్లను బదిలీ చేయించుకున్నారు షర్మిల. కోర్టుల్లో స్టేటస్కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం లీగల్‌గా ఇబ్బంది తెచ్చిపెడుతుందని జగన్‌ను న్యాయవాదులు హెచ్చరించారు. దీంతో న్యాయవాదుల సూచనలతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ లీగల్‌గా NCLTని ఆశ్రయించారు.
తాజా నోటీసుల నేపథ్యంలో కుటుంబ ఆస్తుల వ్యవహారంలో అన్నాచెల్లెళ్ల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలు తెర మీదకు వచ్చాయి. వైఎస్సార్ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన కొన్ని ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆస్తులు కూడా బదిలీ చేయడానికి జగన్ సిద్దపడ్డారు. అయితే సరిగ్గా ఈ సమయంలో వైయస్సార్ మరణం తర్వాత సీబీఐ, ఈడీ కేసులతో వైయస్.జగన్ కు చెందిన ఆస్తులు, కంపెనీలన్నీ కూడా అటాచ్మెంట్లోకి వెళ్లిపోయాయి. అటాచ్మెంట్ కిందున్న ఆస్తులు బదిలీచేయడం కాని, విక్రయించడంకాని చట్ట విరుద్ధం.
దీన్ని దృష్టిలో ఉంచుకుని, తన చెల్లెలితో ఉన్న అనుబంధం దృష్ట్యా, ప్రేమకొద్దీ తాను సొంతంగా సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలికి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 2019 ఆగస్టు 31న షర్మిలకు అగ్రిమెంట్ రాసిచ్చారు. కేసుల్లో ఆస్తులు ఉన్నందున వాటిని నేరుగా బదిలీ చేయడానికి చట్టపరంగా ఆస్కారం లేనందున తన చెల్లెలకు నమ్మకం కలిగించేందుకు అవగాహనా ఒప్పందాన్ని రాసిచ్చారు. ఇలా రాసిన మొత్తం పది రకాల ఆస్తుల్లో సరస్వతీ సిమెంట్స్ కూడా ఒకటి. కేసులు తేలిన తర్వాత వాటిని అప్పగిస్తామని అందులో పేర్కొన్నారు.
అయితే మొత్తం ఆస్తుల బదిలీ ప్రక్రియ కోర్టు తీర్పులకు లోబడి ఉంటాయని రాసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా లావాదేవీలు జరపకూడదు. కానీ షర్మిల సరస్వతి పవర్లో తన తల్లి విజయలక్ష్మి పేరుతో ఉన్న గిఫ్ట్ డీడ్ షేర్లను తనపేరుతో రాయించుకున్నారు. దీనిపై అభ్యంతరం చెబుతూ షర్మిలకు జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. చట్టవిరుద్దంగా జరిగిన షేర్ల బదిలీ వల్ల న్యాయపరంగా చిక్కులు తప్పవని.. తన బెయిలు కూడా రద్దయ్యే అవకాశం ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తనకు తెలియకుండా, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వ్యవహారంపై వైఎస్ జగన్ వెంటనే తన తల్లికి, చెల్లెలకు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. తాను ప్రేమకొద్దీ నమ్మకంతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను వినియోగించుకుని, షేర్ల బదిలీ చేయడం సరికాదని తెలిపారు. ఇది నమ్మకాన్ని వమ్ము చేయడమంటూ స్పష్టం చేశారు. షర్మిల, విజయమ్మ స్పందించకపోవడంతో NCLTని ఆశ్రయించినట్టు చెబుతున్నారు. అదే సమయంలో షర్మిలతో చేసుకున్న MOU రద్దుకు కూడా జగన్ సిద్దపడుతూ లేఖ రాశారు.
కుటుంబ పెద్దగా అందరికీ ఆస్తులు సమంగా పంచాల్సిన బాధ్యతలో ఉండి నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమంటూ ప్రతి లేఖ రాశారు వైఎస్ షర్మిల. ఆస్తుల పంపకంపై చట్టబద్దంగా చేసుకున్న అగ్రిమెంట్ రద్దు చేయాలన్న జగన్ ఆలోచన ఆచరణసాధ్యం కాదన్నారు షర్మిల. నిర్ణయం మార్చుకుని వైఎస్ఆర్ వారసులకు సమంగా ఆస్తులు పంచకపోతే తానే లీగల్ ఫైట్ చేయడానికి సిద్ధమవుతానంటూ అల్టిమేటం ఇచ్చారు షర్మిల. తన రాజకీయాలకు, ఆస్తుల పంపకాలకు ముడిపెట్టడాన్ని షర్మిల తప్పబట్టారు. కుటుంబ ఆస్తుల విషయంలో జరిగిన చర్చలు, పరిణామాలకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న తల్లి విజయలక్ష్మి కూడా లేఖలో సంతకం చేశారని.. ఇది గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు షర్మిల.
అయితే తండ్రి ఉండగా సంపాదించిన ఆస్తుల్లో వాటాలు ఇప్పటికే ఇచ్చామని.. కేవలం ప్రేమాభిమానాలతో తన ఆస్తులు ఇవ్వడానికి జగన్ సిద్దపడ్డారని, అయినా తప్పుగా ప్రచారం చేయడం తగదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి అన్నా చెల్లెళ్ల మధ్య లేఖాస్త్రాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆస్తుల పంపకం విషయంలో విబేధాలు ఉన్నాయని ఇంతకాలం ప్రచారం జరిగినా తాజా పరిణాయాలు వాటిని నిజం చేస్తున్నాయి. మరి వైఎస్ఎర్ కుటుంబంలో తలెత్తిన ఈ సంక్షోభం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి..!