వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్ పట్టించుకోవడం మావేశారు. టీవీ చానల్ మొత్తాన్ని బులుగుమయం చేశాక లోగోలోనూ ఆయన బొమ్మ తీసేశారు. ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ చేర్చారు.
కానీ ప్రయోజనం లేకపోయింది. మెల్లగా పార్టీ అంతర్గత సమావేశాల్లో వైఎస్ బొమ్మను కూడా పెట్టడం తగ్గించారు. ఇప్పుడు షర్మిల వైఎస్ ఇమేజ్ మొత్తాన్ని సొంతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జూలై 8వ వైఎస్ఆర్ 75వ జయంతి జరగనుంది. ఈ వేడుకలను చేయాలని వైసీపీ అనుకోవడం లేదు. ప్రభుత్వం వస్తే ప్రజాధనం పెట్టి పెద్ద ఎత్తున చేసేవారు. కానీ ప్రభుత్వం లేదు కాబట్టి పైసా కూడా ఖర్చు పెట్టే అవకాశం లేదు. అందుకే చేయరు. ఈ అవకాశాన్ని షర్మిల ఉపయోగించుకుంటోంది. వైఎస్ఆర్కు తానే నిజమైన వారసురాలిగా గుర్తింపు పొందేందుకు.. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అని ప్రజలకు తెలియచేసేలా 75వ జయంతి వేడుకల్ని నిర్వహించాలని అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి ఇందు కోసం అనుమతి తీసుకున్నారు.
తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో హైదరాబాద్ లోనూ ఓ సారి సంస్మరణ ఏర్పాటు చేశారు. చాలా మంది వెళ్లారు కానీ.. వైసీపీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ ఎక్కువగా నష్టపోయిందని చెబుతూ ఉంటార కానీ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడం వల్లనే ఎక్కువగా నష్టపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ ఓటర్లు వెనక్కి వచ్చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ కమార్తె కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని ప్రజల్లోకి సందేశం పంపాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు.
మెల్లగా వైఎస్ ను కాంగ్రెస్ ఓన్ చేసుకుంటే… ప్రజల్లోనూ అదే భావన మళ్లీ పెరిగితే.. జగన్ కు అంతకంటే పెద్ద డ్యామేజ్ మరొకటి జరగదు.