కె.కోటపాడు,ఫిబ్రవరి05(ఆంధ్రపత్రిక):
మండలంలో ఇటీవల జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది.రోడ్డు ప్రమాదాలకు, మరణాలకు కారణాలు ఏమైనా పలు కుటుంబాలకు తీరనిశోకం మిగులుతోంది. కన్నబిడ్డలు కళ్ళ ఎదుటే పాడెక్కిపోతుంటే తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.తలకొరివి పెడతాడకున్న కొడుకు కాటికెళ్తుంటే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓదార్చుతున్నవారి కడుపులు తరుక్కుపోతున్నాయి. తాళి కట్టినోడు నూరేళ్లు తోడుంటాడనుకుంటే తిరిగిరాని లోకాలకెళ్లిపోతుంటే ఆ అభాగ్యురాలి ఆవేదనా, రోదనా వర్ణణాతీతం. నాన్న చనిపోయాడని తెలీని అమాయక చిన్నారులను చూసిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటివ్యధ. ఈ నెల 4వ తేదీన మండలంలో చంద్రయ్యపేటవద్ద ఆటో-బైక్ ఢీకొన్న దుర్ఘటన తెలిసిందే. బైక్ పై ప్రయాణిస్తున్న జోగన్నపాలేనికి చెందిన బండారు సన్యాసినాయుడు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. భార్య రామలక్ష్మి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యింది. ఈదుర్ఘటనొక విధిరాతగా కుటుంబసభ్యులు, బంధువులు, ఆప్తులు, ఆత్మీయులు బోరున విలపించారు. ఇదే రోజున పాతవలస గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో గాయపడినట్టు సమాచారం. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం పాతవలస గ్రామానికి చెందిన జామి నారాయణమూర్తి (నాని) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దారుణ దుర్ఘటన మరువకముందే పైడంపేటకు చెందిన యువకుడు కర్ణాటక సాయి రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఒడిలోకి చేరిపోయాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన కొద్ది రోజుల వ్యవధిలో కె. కోటపాడుకు చెందిన రొంగలి అబద్దం పినగాడి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని భయం వెంటాడుతోందని పలువురు అంటున్నారు.