సీఈఓ బాధ్యతల్ని నిర్వహించగలిగే సమర్థుడు దొరికాలి
- ఈ బాధ్యతల్ని తీసుకునే తెలివితక్కువ వ్యక్తి దొరగ్గానే నేను సీఈఓగా రాజీనామా చేస్తా..
ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
న్యూయార్క్,డిసెంబర్ 21 (ఆంధ్రపత్రిక): ట్విటర్ సీఈఓ బాధ్యతల్ని నిర్వహించగలిగే సమర్థుడు దొరికిన వెంటనే తాను ఆ పదవి నుంచి వైదొలగుతానని ఎలాన్ మస్క్ బుధవారం ప్రకటించారు.అయితే, ఈ ప్రకటనను ఆయన కాస్త వ్యగ్యంగా పోస్ట్ చేయడం గమనార్హం. ‘’ఈ బాధ్యతల్ని తీసుకునే తెలివితక్కువ వ్యక్తి దొరగ్గానే నేను సీఈఓగా రాజీనామా చేస్తాను. తర్వాత నేను సాఫ్ట్వేర్, సర్వర్ల బృందాలను చూసుకుంటాను’’ అని ట్వీట్ చేశారు. ఇటీవల నిర్వహించిన పోల్‌లో మెజారిటీ సభ్యులు ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోల్ ఫలితానికి కట్టుబడి ఉంటానన్న హామీ మేరకే తాజాగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ట్విటర్ సీఈవోగా ఉండాలా? వద్దా? అనే దానిపై నిర్వహించిన పోల్‌లో 57.5 శాతం మంది యూజర్లు మస్క్ వైదొలగాలని.. 42.5 శాతం మంది మస్క్ కొనసాగాలని ఓటు వేశారు. దీంతో ఆయన నిజంగానే పక్కకు జరుగుతారా అనే అంశంపై సర్వత్రా చర్చ జరిగింది. తాజాగా ఆయన చేసిన ప్రకటనతో ఆ చర్చలన్నింటికీ తెరపడినట్లయింది. ప్రస్తుతం మస్క్ కొత్త సీఈఓ అన్వేషణను మొదలుపెట్టినట్లు సమాచారం. అక్టోబరులో ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్.. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్ సీఈఓగా కొనసాగాలా? లేక వైదొలగాలా? అంటూ యూజర్ల అభిప్రాయాన్ని కోరారు. మరోవైపు ట్విటర్లో విధానపరమైన మార్పులకు సంబంధించి నిర్వహించే పోల్‌లో కేవలం ట్విటర్ బ్లూ సబ్స్క్రైబర్లు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.