వడ్డించే వాళ్లు మనవాళ్ళు అయితే ఏ బంతిలో కూర్చున్నా ఓకే…!
బందరు మండలంలో ఉపాధ్యాయుల గగ్గోలు..!
మచిలీపట్నం సెప్టెంబర్ 21 ఆంధ్ర పత్రిక.(వక్కలంక వెంకట రామకృష్ణ , స్టాఫ్ రిపోర్టర్) గురువు అంటే గురి చూపేవాడు. అలాంటి గురువుల్లో కొంతమంది ఉపాద్యాయులు ఈ విద్యాసంవత్సరం బందరు మండలంలో స్థిరంగా ఒక్క పాఠశాలలో ఉన్న దాఖలాలు లేవు అని ఉపాధ్యాయ లోకం గగ్గోలు పెడుతోంది. బందరు మండలంలో టీచర్ల అక్రమ డిప్యూటేషన్ల పట్ల ఏ మూల చూసినా ఉపాధ్యాయుల గుసగుసలే వినిపిస్తున్నాయి. ఉదాహరణకు సముద్ర తీర ప్రాంతం దగ్గరలో ఉన్న పోలాటితిప్ప ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు, రెండు సంవత్సరాల లోపే రిటైర్ అవుతున్న దివ్యాంగురాలు. పని సర్దుబాటులో భాగంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కరగ్రహారం దిబ్బల మీద పాఠశాలను కేటాయించారు. కానీ మహమ్మద్ బీన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్ కి , దౌలతా బాద్ నుండి ఢిల్లీకి మార్చినట్టు ఆ దివ్యాంగురాలైన ఉపాధ్యాయురాలిని ఆర్సీఎం కొత్తపూడి ప్రాథమిక పాఠశాలకు వెళ్ళమని మండల శాఖ విద్యాశాఖ అధికారి చెబుతున్నారు. దీనిలో పరమార్ధం ఏమిటి ? అని ఉపాధ్యాయ లోకం చర్చించుకుంటున్నారు. కరగ్రహారం దిబ్బల మీద పాఠశాల బందరుకు సమీప పాఠశాల. అక్కడ పరపతి గల, ప్రసన్నం చేసుకున్న ఉపాధ్యాయులను నియమించారని భోగట్టా. ఇక్కడ ఏ పలుకుబడి పని చేసిందో? అని ఉపాధ్యాయ సంఘాలు అనుకుంటున్నాయి . అసలే దివ్యాంగురాలు. పైగా రెండు సంవత్సరాల లోపు రిటైర్ అవుతున్న ఉపాధ్యాయురాలు. పాపం ఈ ఉపాధ్యాయురాలికి ఎంతటి కష్టం వచ్చిందో? అని ఉపాధ్యాయులు అనుకుంటున్నారు. ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ అమలు చేయాలని నిన్ననే లోక్ సభలో చట్టం చేయడం కూడా జరిగింది. కానీ బందరు మండలంలో ఆడవాళ్ళకి సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా దివ్యాంగురాలైన ఈ ఉపాధ్యాయురాలికి తాను కోరుకున్న ప్రాంతం కేటాయించి, మండల శాఖ అధికారి సహృదయత చాటాలని,ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఇది ఇలా ఉండగా మండలంలో మిగులు ఉపాధ్యాయులని పని సర్దుబాటు కింద అవసరం ఉన్న అన్ని పాఠశాలలకు సర్దుబాటు చేయడం జరిగిందన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పని సర్దుబాటు పేరుతో మండలంలో ఒకే ఉపాధ్యాయుని అనేక ప్రాథమిక ,ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు గంగిరెద్దులా, తిప్పడం ఎంతవరకు భావ్యం? అని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ఏ పాఠశాలకు న్యాయం జరగదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఏకోపాధ్యాయ పాఠశాలలలో ఎవరైనా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు సెలవు పెడితే నిబంధనల మేరకు సీఆర్పీలను, సెలవు పెట్టిన ఆ పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపాలి. కానీ బందరు మండలంలో
వేరే పాఠశాలల నుండి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులని డిప్యూటేషన్ పై పంపడం పట్ల జగనన్న విద్యా బోధన, నాడు – నేడు ఆశయం దెబ్బతింటున్నాయని అంటున్నారు. మచిలీపట్నం అర్బన్ రూరల్ మండలాలు కలిపి 14 మంది సీఆర్పీలు ఉండగా, మండల విద్యాశాఖ అధికారి తనకు కావలసిన అనుంగులను కార్యాలయంలో ఉంచుకొని, మిగిలిన వాళ్ళని మొక్కుబడి గా( నామ్ కే వాస్తే) పాఠశాలకు డెప్యుటేషన్ పై పంపుతున్నారని ఉపాధ్యాయులంటున్నారు. దీనివల్ల బందరు మండలంలో విద్యాబోధన కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయులను డిప్యూటేషన్ పై, పంపడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు. సీఆర్పీలు ఉండగా ఉపాధ్యాయులే డిప్యూటేషన్ పై వెళ్ళాలా? అని అంటున్నారు. జగనన్న విద్యా లక్ష్యం దెబ్బతినకుండా ఉండాలి అంటే ,ఇలాంటి అసమంజస నిర్ణయాలు, అసంబద్ధమైన ప్రణాళికలకు స్వస్తి పలకాలన్నారు.
మండలంలోని సీనియర్ ఉపాధ్యాయులను ఏకోపాధ్యాయ పాఠశాలలకు నియమించడం పట్ల, ఆ సీనియర్ ఉపాధ్యాయుడు ఫోన్ యాప్స్ మేనేజ్ చేయడం సరిగా రాక తీవ్ర గందరగోళానికి గురి అవుతున్నారు.తద్వారా ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతున్నారు అని అంటున్నారు. అదే పాఠశాలలో జూనియర్లు ఉండంగా సీనియర్ ఉపాధ్యాయుని నియమించడం ధర్మమేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం మండల విద్యాశాఖ అధికారి దృష్టికి పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలు తీసుకువెళ్తే ఉపాధ్యాయులను వ్యంగ్యంగా, అపహేళనగా నేనే మీ పాఠశాలకు టీచర్ గా వచ్చి బోధిస్తాను, అని ఉపాధ్యాయులతో ఎంఈఓ అనడం భావ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారి మండలంలో ఉపాద్యాయినీ, ఉపాధ్యాయులకు, దశా, దిశా, చూపించే దిక్సూచి లాంటివారు. అలాంటి మండల విద్యాశాఖ అధికారి ఇలా మాట్లాడడం సబబా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారి ఇలా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను చులకనగా చూస్తుంటే ఉపాధ్యాయులు మరింత తెలివిగా మీరే మొదటి ఉపాధ్యాయునిగా మా పాఠశాలలో చేరితే రెండవ ఉపాధ్యాయులుగా మేమే మీ వద్దే పని చేస్తాం, అని అనడం ముక్తాయింపు..! ఇప్పటికైనా బందరు మండల విద్యాశాఖ అధికారి అక్రమ డిప్యూటేషన్లను అరికట్టి ఉపాధ్యాయులకు సరైన న్యాయం చేసి పాఠశాలల్లో విద్యా లక్ష్యాలు పరిపూర్ణంగా నెరవేరేలా బీజాలు వేసి, జగనన్న ఆశయం దెబ్బతినకుండా పరిరక్షిస్తారని ఆశిస్తున్నామని ఉపాధ్యాయ నాయకులు అంటున్నారు. మరి ఆ దిశగా బందరు మండలం పయనిస్తుందని ఆశిద్దాం..!