మీకు ఆ వ్యత్యాసం కనిపించటం లేదా..?
న్యూఢల్లీి,అక్టోబర్ 13 అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక):కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన సీనియర్ నేత శశిథరూర్ తన విమర్శలకు పదును పెంచారు. మరో అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గేకు తనకూ మధ్య చూపుతోన్న వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది పారదర్శక ఎన్నిక ప్రక్రియను దెబ్బతీస్తుందని అన్నారు. దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఏ రాష్ట్రం వెళ్లినా.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, ఇతర నేతలు ఖర్గేను ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు. పలుచోట్ల నేను ఈ విషయాన్ని గమనిస్తున్నాను. అదంతా ఒక అభ్యర్థికే జరుగుతోంది. నా విషయంలో మాత్రం భిన్నంగా ఉంది. నేను వెళ్లిన దగ్గర రాష్ట్ర అధ్యక్షులు అందుబాటులో ఉండటం లేదు. ఇక్కడ నేను ఫిర్యాదులేమీ చేయడం లేదు.
కానీ మీకు ఆ వ్యత్యాసం కనిపించడం లేదా..?
అక్టోబర్ 17న జరిగే పార్టీ అధ్యక్ష ఎన్నికలో ఓటువేసేవారి జాబితా నాకు అందినప్పటికీ.. అది అసంపూర్తిగా ఉంది. అందులో ఫోన్ నంబర్లు లేవు. అప్పుడు నేను ఓటువేసే ఆ ప్రతినిధులను ఎలా సంప్రదించాలి? ఇది కావాలని చేస్తున్నారని నేనట్లేదు. 22 సంవత్సరాలుగా పార్టీ అత్యున్నత పదవికి ఎన్నిక జరగపోవడంతో ఈ లోపాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను మీడియాపైనే ఆధారపడి ఉన్నాను. నా మేనిఫేస్టోను ఓటర్లకు చేరవేసేందుకు సహకరించాలి’ అని కోరారు. చివరకు మాత్రం ఖర్గేతో తనకు ఎలాంటి విరోధం లేదని స్పష్టం చేశారు.
మాది సోదర బంధం: ఖర్గే
శశిథరూర్ వ్యాఖ్యలపై ఖర్గే స్పందించారు. గాంధీ కుటుంబం మద్దతు ఖర్గేకే అని జరుగుతోన్న ప్రచారంపైనా ఆయన మాట్లాడారు. ‘థరూర్ నాకు సోదర సమానుడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడాలు లేవు. నేతలు, ప్రతినిధులు కలిసి నన్ను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టారు. గాంధీ కుటుంబం పేరును ఇందులోకి లాగడం భాజపా కుట్రలో భాగమే. దానికి తగ్గట్టే కొందరు ప్రవర్తిస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాను’ అని అన్నారు.