ఎందుకమ్మా ఇలా చేశావ్.. కన్న కొడుకు కళ్లలోనే కారం కొట్టి..
ANDHRAPATRIKA : – – ఆస్తుల ముందు అప్యాయతలు, అనురాగాలు కనుమరుగైపోతున్నాయి.. కన్న వారిని సైతం అడ్డుతొలగించుకునేందుకు సైతం వెనుకాడటం లేదు. అర ఎకరం పొలం కోసం ఆరు నెలల నుండి కొనసాగుతున్న వివాదం..
ఏకంగా ఆ తల్లి కన్న కొడుకునే చంపుకునే వరకు వెళ్లింది.. అయితే పోలీసులు విచారణలో కన్న కొడుకును తల్లి, అతని సోదరులు కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని తెలుసుకున్న పోలీసులు అందరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరవై ఏళ్ళ క్రితం క్రోసూరు మండలం హసనాబాద్ కు చెందిన హుస్సేన్ కి మున్నిబీకి వివాహమైంది. వీరికి మహబూబ్ బాషా జన్మించిన రెండేళ్ల తర్వాత విబేధాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మున్నీబి తమ్మవరానికి చెందిన కరిముల్లాను పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. కరిముల్లా, మున్నిబీలకు ఇద్దరూ సంతానం కలిగిన తర్వాత కరీముల్లా కూడా చనిపోయాడు. దీంతో మున్నిబీ తన ఇద్దరూ బిడ్డలను తీసుకొని హసనాబాద్ వచ్చింది. అయితే, మొదటి భర్త సంతానమైన మహబూబ్ బాషాకి తన తండ్రి ఆస్తి మొత్తం దక్కింది. రెండో భర్త కుమారుడైన బాసిత్ కి తక్కువ ఆస్తి వచ్చింది. ఈ క్రమంలోనే తన మొదటి భర్త ద్వారా తనకు రావాల్సిన ఆస్తి విషయంలో కుమారుడైన మహబూబ్ భాషాకి మున్నిబీకి మధ్య వివాదం నడుస్తోంది. ఈ వివాదం నడుస్తుండగానే మహబూబ్ బాషాకి అదే ఊరికి చెందిన యువతితో వివాహమైంది. దీంతో తమకు ఆస్తి రాదన్న భావన మున్నిబీ, బాసిత్ కు ఏర్పడింది.
ఆస్తిని దక్కించుకోవాలంటే మహబూబ్ బాషా అడ్డుతొలగించుకోవాలన్న ఆలోచన తల్లికొడుకులకు వచ్చింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం మహబూబ్ భాషా ఇంటి పైకి తల్లి మున్నిబీ, తమ్ముడు బాసిత్ మరో పది మంది కలిసి గొడవకు వెళ్లారు. మహబూబ్ భాషా కళ్లలో తల్లే కారం కొట్టగా మిగిలిన వారంత కలిసి దాడి చేశారు.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహబూబ్ బాషా బావమరిదిపై కూడా దాడి చేసి గాయపర్చారు. ఇదంతా కూడా ఆస్తి వివాదంలో జరిగిన గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
అయితే, తీవ్ర గాయాలపాలైన భాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు పదిమందిని అరెస్ట్ చేశారు.