ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై కాల్పుల యత్నం జరగడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.
ఈ ఘటనపై స్పేస్ఎక్స్, ‘ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందిస్తూ డెమోక్రాట్ నేతలపై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు.
”అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు” అంటూ సందేహం వ్యక్తంచేస్తున్న ఎమోజీని జత చేశారు. ట్రంప్‌నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్‌పై మస్క్ ఈవిధంగా స్పందించారు. తాజా ఎన్నికల్లో ట్రంప్‌నకు ఈ బిలియనీర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బైడెన్ లాంటి భద్రత కల్పించాలి: వివేక్ రామస్వామి
ఈ ఘటనపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ”మరో హత్యాయత్న ఘటన నుంచి ట్రంప్ క్షేమంగా బయటపడ్డారు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు. అయితే, ఇలాంటి రాజకీయ హింస ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తక్షణమే ఆపాలి. ఇక, ట్రంప్‌నకు కూడా అధ్యక్షుడు బైడెన్‌కు కల్పిస్తున్న అత్యున్నత స్థాయి భద్రతను అందించాలి. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు” అని రాసుకొచ్చారు.
ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ (Donald Trump) గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. అనుమానితుడిని ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లు అమెరికా కథనాలు వెల్లడించాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US President Elections) సమీపిస్తున్న వేళ ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జులైలో ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకువెళ్లింది. వెంట్రుకవాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నారు.