White Hair: మారిన జీవనశైలి, ఉద్యోగ బాధ్యతలతో పెరిగిన ఒత్తిడి కారణంగా.. జుట్టు తెల్లబడడం, రాలడం, చుండ్రు అనేవి సర్వసాధారణ కేశ సమస్యలుగా మారాయి.
అయితే ఒత్తిడి లేకపోయినా లేదు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే అందుకు మనం తినే ఆహారమే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. అవును, వృద్ధాప్యానికి సంకేతమైన తెల్ల జుట్టు మనం తినే ఆహారం కారణంగానే మొదలవుతుంది. కొన్ని రకాల ఆహారాలను అతిగా తినడం వల్ల జుట్టు తెల్లబడుతుందని కేశ నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఆ ఆహారాలు జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కూడా వివరించారు. మరి ఏయే ఆహారాలను అతిగా తినడం వల్ల జుట్టు తెల్లబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కూల్ డ్రింక్స్: చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడానికి కూల్ డ్రింక్స్ ఒక కారణం. ఎందుకంటే ఈ డ్రింక్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే సోడా, చక్కెర.. జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లను శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మీ జుట్టు త్వరగా తెల్లబడుతుంది.
చక్కెర: చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తినేవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది. చిన్నవారిలో కూడా వెంట్రుకలు వేగంగా తెల్లగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు, నల్లబడేందుకు విటమిన్ ఇ ఎంతగానో అవసరం. అయితే చక్కెర ఎక్కువగా తీసుకుంటే దాంతో శరీరం విటమిన్ ఇ ని గ్రహించలేదు. ఆ కారణంగా జుట్టు త్వరగా తెల్లగా అవుతుంది.
మోనోసోడియం గ్లూటమేట్: మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తరచూ ఎక్కువగా తీసుకున్నా కూడా వెంట్రుకలు త్వరగా నెరుస్తాయి. ఎందుకంటే ఈ మోనోసోడియం గ్లూటమేట్ మన శరీర మెటబాలిజం ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. అంతేకాక జుట్టు సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఉప్పు: ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా జుట్టు తెల్లబడుతుంది. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాలు నియంత్రణ కోల్పోతాయి. ఆ ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా చేరితే జుట్టు సమస్యలే కాదు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.