ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. గత రెండు నెలలుగా సస్పెండ్ అయిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్ రెడ్డి పరారీలో ఉన్నారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి, అతని పై అధికారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటం చాలా నేరమని ప్రభుత్వం అంటోంది. గత వైసీపీ ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన వెంకటరెడ్డి అరెస్టు భయంతో ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఏసీబీ అధికారులు అంటున్నారు.
గతనెల రోజుల నుండి నోటీసులు జారీ చేయాలని వెతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు చివరికి ఆయన పైన దర్యాప్తు మొదలుపెట్టారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర అనుమతి తీసుకుని వెంకటరెడ్డి పై విచారణ మొదలుపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో గనులు, ఖనిజం, ఇసుక దోపిడీకి వైసీపీ పెద్దలకి వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లోని వెంకటరెడ్డి ఇంటికి ఏసీబీ అధికారులు నోటీసులు అంటించారు. అయినా కూడా వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ, ఏసీబీ అధికారులను కానీ కలుసుకొని వివరణ ఇవ్వడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్న ఏసీబీ అధికారులు వెంకటరెడ్డి పై విచారణ మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నగరంలో, హైదరాబాదులోని ఇంటిలో, చెన్నైలోనే నివాసంలో వెంకట్ రెడ్డి కోసం గాలించినా ఆయన ఆచూకీ మాత్రం చిక్కడంలేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థ గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇసుక టెండర్లను తీసుకుంది. అయితే జేపీ పవర్ వెంచర్స్ సంస్థ సుమారు. 800 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
అయితే జేపీ వెంచర్ సంస్థ గత వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేదంటూ ఆ సంస్థకు ఎన్ఓసీ ఇచ్చేసిన వెంకటరెడ్డి చేతులు దులుపుకున్నారు. జేపీ వెంచర్ సంస్థకి రూ. 800 కోట్లకు పైగా లబ్ది చేకూరడానికి గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు, వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూడడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. సుమారు రెండు నెలలపాటు ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్న గనుల శాఖ మాజీ ఎండి వెంకట్ రెడ్డి ఇదే నెల 31వ తేదీ రిటైర్డ్ కావలసి ఉంది.
అయితే ఇదే నెల ఒకటవ తేదీన వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడంతో ఆయన పదవీ విరమణ చేసే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. సస్పెండ్ కాకముందే వెంకటరెడ్డి ఎక్కడ తలదాచుకున్నాడు అనే విషయం తెలియకపోవడంతో ఆయన కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఏపీ గనుల శాఖలో వెంకటరెడ్డికి పూర్తిగా సహకరించిన అధికారులు కూడా ఇప్పుడు ప్యాంట్లు తడిసిపోతున్నాయని ఆ శాఖలోని కొందరు అధికారులు గుసగుసలాడుతున్నారు.