మచిలీపట్నం నవంబర్ 18 ఆంధ్ర పత్రిక.
శనివారం ఉదయం 11 గంటల సమయం. కలెక్టరేట్ ప్రాంగణంలో విచ్చలవిడిగా కుక్కలు స్వైర్య విహారం చేస్తూ కనిపించాయి. ఇటీవల కలెక్టరేట్ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు చేపట్టాలని, ప్రాంగణమే కాక చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సాధారణంగా శనివారం నాడు సందర్శకుల తాకిడి తక్కువగా ఉంటుంది. స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తారు. ఆరోజు మాత్రం కలెక్టరేట్ ని చుట్టుపక్కల ప్రాంగణాలని పరిశుభ్రంగా ఉంచుతారు. మిగిలిన రోజుల్లో నగరపాలక సంస్థ సిబ్బంది మొద్దు నిద్ర నటిస్తారని, పరిసర ప్రాంత ప్రజలు అంటున్నారు.
శుభ్రత పరిశుభ్రత మన ఇంటికి ఎలా నిర్వహిస్తామో, కార్యాలయాల్లో కూడా అలా నిర్వహించవలసిన బాధ్యత కిందిస్థాయి అధికారులకు ఉంది. వారి సిబ్బందికి, కార్యాలయ అటెండర్లకు, నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి అధికారులు సూచనలు చేసి జిల్లాకు ముఖ్యమైన, గుండెకాయ లాంటి కలెక్టరేటును, పరిసరాలను పరిరక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యమైన సమావేశాలు నిర్వహించినప్పుడు, జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఉన్నప్పుడు, వీఐపీలు సందర్శకులు కలెక్టరేట్ కి వచ్చినప్పుడు మాత్రమే కాక, సాధారణ రోజుల్లో కూడా కలెక్టరేట్ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత కింది స్థాయి అధికారులపై ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
కలెక్టరేట్ ప్రాంగణంలోనే వివిధ శాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు స్పందన సమావేశం మందిరం దగ్గరే విచ్చలవిడిగా వీధి కుక్కలు విలయతాండవం చేస్తుంటే పట్టించుకునే నాధులే కరువయ్యారు. సమూహాలుగా తిరుగుతున్న కుక్కలు మూకుమ్మడిగా ఎవరిపైనైనా దాడి చేస్తే పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలంటే తీవ్ర భయాందోళనలకు గురికావలసి వస్తోంది.
సమ కాలిన సమస్యలతో నిత్య సతమతం అయ్యే సామాన్య మానవుడు తన సమస్యలు అధికారులకు చెప్పుకుందుకు కలెక్టరేట్ కు రావడం జరుగుతుంది. గ్రామ సింహాలు, వచ్చిన సందర్శకులను ఇలా భయపెడుతూ ఉంటే సమస్య సంగతి పక్కన పెడితే, కుక్క కాటుకు గురి కాకుండా తమల్ని తాము కాపాడుకోవడం ఎలా? అని ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పారిశుద్ధ్య లోపం:
కలెక్టరేట్ చుట్టుపక్కల పరిస్థితులు, మరింత అద్వానంగా ఉన్నాయి. కలెక్టరేట్ గోడని ఆనుకొని ఉన్న గాంధీనగర్ రోడ్డు చెత్త, చెదారం తో తీవ్ర అద్వానంగా ఉంది. అక్కడ పారిశుద్ధ్య సేవలు జరిగి ఐదు రోజులు గడిచింది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిరోజు కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న అపరిశుభ్ర వాతావరణన్ని గుర్తించి, పారిశుద్ధ్య సిబ్బంది పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలాగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజానీకం కోరుతున్నారు. అలాగే బ్లీచింగ్ కూడా చల్లించే ఏర్పాట్లు చేయాలి. నగరంలో జిల్లా జడ్జి నివాసం ఉండే చుట్టుపక్కల ప్రాంతం కూడా తీవ్ర అపరిశుభ్ర వాతావరణం లో దర్శనం ఇచ్చినా అక్కడ కూడా పారిశుద్ధ్యం పట్ల నగర పాలక సంస్థ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం చూపడం గమనార్హం. జిల్లా అధికారులు నివసించే ప్రాంతాలే అపరిశుభ్రానికి ఆనవాళ్లు గా మారితే సామాన్య ప్రజానీకం నివసించే ప్రాంతాలు మరెంత అందంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. అసలే డెంగ్యూ,మలేరియా తదితర జ్వరాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు అపరిశుభ్ర వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో ఎలా గడపడం అని ముక్కులు మూసుకుని జీవనం సాగిస్తున్నారు.
తీవ్ర దుర్గంధం తో నిండిన గాంధీనగర్ వీధి కలక్టరేట్ గోడ వెనక ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం వల్ల కలెక్టరేట్ లోని ఉద్యోగులకు కూడా ఆ దుర్వాసన కార్యాలయం లోపలకువస్తొంది అంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
శుభ్రత, పరిశుభ్రత ,ఇంటికి ఒంటికి మాత్రమే కాదు. మనం పని చేస్తున్న కార్యాలయాలు చుట్టుపక్కల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. ఆ ఉద్దేశ్యంతోనే
కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కలెక్టరేట్ ప్రాంగణాన్ని సంస్కరించాలని ఇటీవల అధికారులను ఆదేశించడం జరిగింది. కడియం నుండి పూల మొక్కలు తెప్పించి కలెక్టరేట్లో గ్రీనరీ ని పెంచాలని లైటింగ్ ఏర్పాటు చేయాలని భవనాలు ఆధునీకరించాలని కలెక్టరేట్ ప్రాంగణంలోకి పశువులు, జంతువులు రాకుండా నియంత్రించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
కానీ కార్య రూపంలో జిల్లా కలెక్టర్ మాటల్ని కూడా కింది స్థాయి అధికారులు పెడ చెవిన పెట్టడం వల్ల కార్యాలయ ప్రాంగణం చుట్టుపక్కల తీవ్ర దుర్గంధ భరితంగా మారింది.
కలెక్టరేట్ కు వెళ్లే చుట్టుపక్కల రహదారుల పరిస్థితి తీవ్ర అద్వానంగా మారడంతో అటు వైపుగా వెళ్తున్న ప్రజలు ముక్కులు మూసుకుని ప్రయాణం చేయవలసిన దుర్గతి దాపురించింది.
నగరంలో పశు నియంత్రణ చర్యలు చేపట్టాలని, జిల్లా కలెక్టర్ నూతన సంస్కరణలకు నాంది పలికారు. అలాగే విచ్చల విడిగా పెరిగిపోతున్న వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నగరపాలక సంస్థ సిబ్బంది చేయించడం వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుంది అని ప్రజానీకం అనుకుంటున్నారు. నగరంలో తిరిగే వివిధ రకాల కుక్కలకు మంగు మచ్చలకి తోడు , పిచ్చి కుక్కలు తిరుగుతుండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ కుక్క ఎప్పుడు కరుస్తుందో అని తీవ్ర ఆందోళనలో క్షణక్షణం, ప్రతిక్షణం భయం భయంగా గడుపుతున్నారు. నగరంలో ఏ వీధి చూసినా కుక్కల మయమే.
ఇప్పటికైనా నగరపాలక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తూ శుభ్రత , పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారని కలెక్టర్ ఆశయాలను నెరవేరుస్తారని ఆశిద్దాం..!