చాలావరకు ద్విచక్ర వాహనాలు సమతలమైన రోడ్ల మీదనే సజావుగా నడుస్తాయి. ప్రత్యేకంగా దృఢమైన టైర్లతో రూపొందించినవి ఎగుడు దిగుడు దారుల్లోనూ ప్రయాణించగలవు.
మంచు పేరుకుపోయిన దారుల్లో నడిచే వాహనాలు చాలా అరుదు.
నిత్యం భారీగా మంచు కురిసే దేశాల్లో వాహనాలు నడపడం అంత తేలిక కాదు. రోడ్ల మీద గాని, ఎగుడు దిగుడు కొండ దారుల్లో గాని ఎంతగా మంచు పేరుకుపోయినా తేలికగా నడపగల ద్విచక్ర వాహనాన్ని రూపొందించింది కెనడియన్ కంపెనీ ‘రాకీ మౌంటెయిన్’. ‘పవర్ ప్లే’ పేరుతో ఎగుడు దిగుడు మంచుదారుల్లోనూ అత్యంత సునాయాసంగా దూసుకుపోయే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తీర్చిదిద్దింది.
దీనికి అమర్చిన ‘డైనేమ్-4.0’ మోటారు గరిష్ఠంగా 700 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి, అడుగుకు 79 పౌండ్ల శక్తితో చక్రాలు తిరిగేలా చేస్తుంది. దీనివల్ల వాహనం మంచును చీల్చుకుంటూ దూసుకుపోగలదు. మంచు దారుల్లో ప్రయాణించే ‘పవర్ ప్లే’ బైక్ ‘ఎ50’, ‘ఎ30’ మోడల్స్‌లో దొరుకుతుంది. వీటి ధరలు 6199 డాలర్లు (రూ.5.15 లక్షలు), 5889 డాలర్లు (రూ.4.89 లక్షలు).