ప్రభుత్వం తీరుపై మండిపడ్డ పవన్ కళ్యాణ్
- జేసీబీలతో నిర్దాక్షిణ్యంగా ఇళ్లు కూల్చివేతలపై ఆగ్రహం
- కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది
- వైసీపీ ఓటు వేసినవారిని ఒకలా.. వేయనివారని ఒకలా చూస్తోంది
- ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అరాచకం
అమరావతి,నవంబర్4(ఆంధ్రపత్రిక):వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటం గ్రామంలో పోలీస్ బలగాల సాయంతో జేసీబీలతో నిర్దాక్షిణ్యంగా ఇళ్లు కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేసినవారిని ఒకలా.. ఓటు వేయనివారని శత్రువులుగా చూస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలన నూటికి నూరుశాతం అలాగే ఉందని, వైసీపీకి అనుకూలంగా లేనివారిని ’తొక్కి నార తీయండి’ అనే విధంగా కొనసాగుతోందన్నారు.ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అరాచకమే సాగుతోందన్నారు. ఇప్పటం గ్రామవాసులు జనసేన మద్దతుదారులు కావడమే వైసీపీ ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి కారణమన్నారు. ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంటే ఇంకా విస్తరణెళింటని ప్రశ్నించారు. కూల్చివేత నోటీసులపై గ్రామస్తులు ఇప్పటికే కోర్టుకెళ్లారని అన్నారు. ఇప్పటం గ్రామస్తుల ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి జనసేన అండగా నిలబడుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.