ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, ఏపీలో పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానంతో తెలంగాణకూ సంబంధం ఉందా? జనరల్‌గా లేదనే సమాధానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే.. అవి ఏపీకి సంబంధించిన అంశాలు.
కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇలాంటి అంశాలపై డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో, పోర్టులలో, టీటీడీలో తమకూ వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశాలపై కూడా ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య భేటీలో చర్చించాలనే వాదన తెలంగాణ నుంచి వస్తుండటంతో.. దీనిపై ఏపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ఏపీ మంత్రి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ శుభ పరిణామం. విభజన చట్టంలోని అంశాలు, నీటి సమస్యలపై స్నేహపూర్వకంగా చర్చలు జరగాలి. రాజకీయాలకు తావులేకుండా సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావడం అభినందనీయం” అని ఆయన అన్నారు. ఇంకా ఏమన్నారంటే.. “రెండు ప్రాంతల మధ్యా వైషమ్యాలు పెంచుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఆయన విద్వేషపూరితమైన వాతావరణాన్ని నెలకొల్పారు. ఇప్పటివరకు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు. గతంలో ముఖ్యమంత్రుల మధ్య సహకారం లేక కేంద్రం ఏమీ చెయ్యలేక పోయింది” అన్న ఆయన.. “చట్ట ప్రకారమే అన్ని పంపకాలూ జరగాలి అన్నారు. చట్టాన్ని కాదని డిమాండ్లు పెడితే దానిపై చర్చ జరగాలి అన్నారు. తద్వారా విభజన చట్టంలో అంశాలే ప్రాధాన్య అంశాలుగా చర్చ ఉండాలని ఆయన కోరుతున్నారు.
“లక్ష పదివేల కోట్ల అప్పుతో ఏపీ ఉంది. అన్యాయం జరిగింది ఏపీకే, రాజధాని లేని రాష్ట్రం ఏపీ అన్న సత్యకుమార్… డిమాండ్లు పెట్టడంలో తప్పులేదు కానీ అత్యాశపరమైన డిమండ్లు కరెక్ట్ కాదు అన్నారు. అన్ని సమస్యల్నీ ఇద్దరు సీఎంలూ కలిసి పరిష్కరించుకోవాలనీ, ఇప్పటి వరకు అన్యాయం జరిగిన రాష్ట్రం ఏపీ వైపే కేంద్రం ఉందని అన్నారు. పోలవరం, రైల్వే జోన్‌కు కేంద్రం సహకారం ఉందన్నారు.
ఇలా ఇద్దరు సీఎంల భేటీపై ఓవైపు సానుకూల ప్రకటనలు, మరోవైపు అభ్యంతరాలూ వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యూహాతకంగానే కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోందా అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం.. ఈ భేటీ వల్ల రెండు రాష్ట్రాలకూ ఇప్పటికిప్పుడు కలిగే ఫలితం ఏదీ ఉండదనే టాక్ వినిపిస్తోంది. ఐతే.. ఇలాంటి భేటీ ఒకటి జరగడం మంచిదే అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. సమస్యల్ని అలా వదిలేసే కంటే.. పరిష్కారం దిశగా అడుగులు వెయ్యడం మంచిదే అంటున్నారు కొందరు నెటిజన్లు.