తదుపరి విచారణను రేపటికి వాయిదా
స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు
అమరావతి,డిసెంబర్ 21 (ఆంధ్రపత్రిక): రుషికొండపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు తామే కమిటీని నియమిస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారంటూ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. కమిటీపై ఉన్న అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్లకు కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.రుషికొండపై తవ్వకాలు, నిర్మాణ భవనాలపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కమిటీ వేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సభ్యులుగా చేర్చడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కమిటీలో సభ్యులుగా ఎలా నియమిస్తారని కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తాజాగా కమిటీ సభ్యుల నియామకాన్ని సమర్థిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. పిటిషన్‌పై విచారణ జరిపి కమిటీని తామే నియమిస్తామని స్పష్టం చేసింది.