సైబర్ పోలీసుల పేరిట మాయగాళ్ల బెదిరింపులువాట్సప్, మెయిళ్లకు ఎఫ్ఐఆర్ కాపీలు
స్మార్ట్‌ఫోన్ చేతికొచ్చాక.. వయోబేధం లేకుండా ఇష్టమైనవన్నీ వీక్షిస్తున్నారు.
అశ్లీల వెబ్సైట్లను చూసినప్పుడు గోప్యత పాటించే వెసులుబాటును ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ‘మీ ఐపీ అడ్రస్‌తో ఏం చేస్తున్నారో.. ఇంకేం చూస్తున్నారో మాకు తెలుస’ంటూ.. సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సప్ నంబర్, ఈ-మెయిల్ చిరునామాకు హెచ్చరికలు వస్తే.. భయపడడం ఖాయం. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని సైబర్ మాయగాళ్లు కొత్త ఎత్తు వేస్తున్నారు. పౌరులను భయపెట్టి అందినంత సొమ్ము వసూలు చేస్తున్నారు. నగర సైబర్‌క్రైమ్ పోలీసులకు రోజూ 10 ఫిర్యాదులు అందుతున్నాయి. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, కస్టమ్స్ విభాగాల అధికారులమంటూ బెదిరించి రూ.లక్షలు వసూలు చేేశారంటూ వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పుడేం చేస్తున్నారంటే
తాజాగా నిందితులు దిల్లీ, ముంబయి సైబర్‌క్రైమ్ పోలీసులమంటూ బెదిరిస్తున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్టేట్ సైబర్ సెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ రంగంలోకి దిగుతున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నారని.. తమ పరిశోధన విభాగం నిఘాలో మీ ఐపీ అడ్రస్‌లో వీడియోలను వీక్షిస్తున్నట్లు గుర్తించినట్టు భయపెడతారు. దీనికి 24 గంటల్లో సమాధానం రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసేలా తాము ఆదేశాలిస్తామంటారు. ఇదంతా నిజమని భావించిన బాధితులు అడిగినంత సొమ్ము మాయగాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేసి నష్టపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర నిఘా, దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయడం.. వీడియోకాల్ ద్వారా విచారణ జరపటం చేయవని సైబర్‌క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.
పరువు పోతుందనే భయమే అధికం
‘సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వైద్యురాలికి సీబీఐ అధికారులమంటూ వాట్సప్ వీడియో కాల్.. ఆమె పేరిట డ్రగ్స్, విదేశీ నగదు వచ్చాయని బెదిరిస్తూ రూ.కోటి కాజేశారు. ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై ప్రశ్నించినపుడు.. అట్నుంచి ఫోన్ చేసిందే పోలీసులమని చెబితే తాను ఇంకెవరిని ఆశ్రయించాలంటూ ఆమె అమాయకంగా సమాధానమిచ్చార’ని పోలీసు అధికారి వివరించారు. ఉన్నత విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు, వయోధికులు ఎక్కువగా ఈ తరహా మోసాల బారిన పడుతున్నారు. సీబీఐ, సైబర్‌క్రైమ్ అధికారులమనగానే భయపడుతుంటారు. తమ ఆధార్, పాన్‌కార్డు, ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటి చెబుతుంటే నిజమనే అభిప్రాయానికి వస్తున్నారు. వయోధికులైతే ఈ వయసులో కేసులు, కోర్టులు ఎందుకనే ఆందోళనకు గురవుతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకునేందుకు వెనుకాడుతున్నారు. శివారు ప్రాంతానికి చెందిన బాధితుడు ఈడీ విభాగం అనగానే భయపడి రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. 3 నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. ఆందోళనతో ఏం చేయాలో తోచక ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితుడు చెప్పాడు.