దేశ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విపరీతమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి శీతల పానియాలవైపు జనం పరుగులు తీస్తున్నారు.
మరికొంత మంది చల్లని పుచ్చకాయలు తింటూ ఉపశమనం పొందుతున్నారు. అయితే మీరు తినే పుచ్చకాయ మంచిదో.. కాదో.. ఎప్పుడైనా టెస్ట్ చేశారా? అదేంటీ అనుకుంటున్నారా?
అవును.. వేసవిలో మాత్రమే వచ్చే పుచ్చకాయలను కొందరు వ్యాపారస్తులు స్వార్ధంతో విషపూరితమైన రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారు. దీంతో పక్వానికి ముందే పుచ్చకాయ ఎర్రగా పండుతుంది. ఇలాంటి ఎర్రగా పండిన పుచ్చకాయలను మార్కెట్లో విక్రయిస్తున్నారు.
వేసవిలో డిమాండ్ భారీగా ఉండటంతో ఇలా ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. రసాయనాలతో కృత్రిమంగా పండించిన పుచ్చకాయలు తింటే ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలు ముందుగానే పక్వానికి రావడానికి, లోపల భాగం ఎర్రగా కనిపించడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి.. ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని సూదుల ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.
మార్కెట్లో దొరికే పుచ్చకాయల్లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవాలంటే.. పుచ్చకాయను కోసి దాని జ్యుసి భాగంలో దూదిని రుద్దితే దూది ఎర్రగా మారితే ఆ పుచ్చకాయను రసాయనాలతో పంచించినట్లు అర్ధం. అలాగే పుచ్చకాయపై తెల్లటి పొడి పదార్థం కనిపించినా జాగ్రత్త పడాలి. ఇది కార్బైడ్ కావచ్చు. దీనిని పుచ్చకాయలను పండించడానికి ఉపయోగిస్తారు.
పుచ్చకాయపై ఉండే పసుపు గుర్తు ద్వారా నిజమైన పుచ్చకాయను గుర్తించవచ్చు. పుచ్చకాయ సహజంగా పక్వానికి వచ్చిందనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి పుచ్చకాయలు ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా పండినట్లు సంకేతం. అలాగే బూడిద రంగు మచ్చలు ఉన్నా అది కూడా నిజమైనదని గుర్తించాలి.