మనం తాగే వాటర్ బాటిల్స్ నుంచి, చేతిలో ఉండే మొబైల్ ఫోన్స్, ధరించే ఆభరణాల కొనుగోలు సమయంలో ఎంతటి మోసాలు జరుగుతున్నాయో వివరించే స్టోరీ ఇది. విశాఖలో తూనికలు, కొలతల అధికారులు తాజాగా చేసిన దాడులలో అనేక సరికొత్త మోసాలు వెలుగు చూశాయి. ఎక్కడ తనిఖీలు చేస్తే అక్కడ నూతన తరహా మోసాలు గుర్తించడంతో బెంబేలెత్తారు వెయిట్స్ అండ్ మెజర్మెంట్ అధికారులు.
మనం తాగే వాటర్ బాటిల్స్ నుంచి, చేతిలో ఉండే మొబైల్ ఫోన్స్, ధరించే ఆభరణాల కొనుగోలు సమయంలో ఎంతటి మోసాలు జరుగుతున్నాయో వివరించే స్టోరీ ఇది. విశాఖలో తూనికలు, కొలతల అధికారులు తాజాగా చేసిన దాడులలో అనేక సరికొత్త మోసాలు వెలుగు చూశాయి. ఎక్కడ తనిఖీలు చేస్తే అక్కడ నూతన తరహా మోసాలు గుర్తించడంతో బెంబేలెత్తారు వెయిట్స్ అండ్ మెజర్మెంట్ అధికారులు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఉండాలంటే భారీగా ఫైన్ లు వేయడమే సరైన వ్యూహం అని నిర్ణయించారు. ఆశ్చర్యం ఏంటంటే తూనికలు, కొలతల అధికారులు మొబైల్ షాప్స్ నుంచి కిరాణా షాప్స్ వరకు ఏది తనిఖీ చేసినా అన్నింటిలో అవకతవకలు ఉండడంతో వినియోగదారుల కంటే ముందు అధికారులే బెంబేలెత్తి పోయారు.
మొబైల్ మ్యాన్ ఫ్యాక్చర్ వివరాలు లేవని కేసులు
మొదట వెయిట్స్ అండ్ మెజర్మెంట్ అధికారులు డాబాగార్డెన్స్‌లోని మొబైల్ దుకాణాల్లో మ్యాను ఫ్యాక్చర్ వివరాలు లేకుండానే అమ్ముతున్న మొబైల్స్‌ను గుర్తించారు. వాటి కొనుగోలు పై సరైన సమాధానం రాక పోవడంతో వారిపై ఐదు కేసులు నమోదు చేశారు. అనంతరం ఆ తరహా ఫిర్యాదులు ఎక్కువ రావడం తో నగరంలోని పలు ఎలక్ట్రికల్ దుకాణాల్లోని పరికరాల్లో ఊరూ, పేరు లేని వాటిని పెద్ద సంఖ్యలో గుర్తించారు. మొబైల్ దుకాణాల్లోని స్పేర్ పార్ట్స్, అటోమొబైల్ పరికరాల్లో ప్యాకేజింగ్ నిబంధనలు పట్టించుకోకుండా అమ్ముతున్న పలు విడి భాగాలు వెలుగు చూశాయి. ఇష్టం వచ్చిన ధరలకు అమ్మడం, తూకాల్లో తేడాలు, కొనుగోలు దారులు వివరాలు లేకపోవడం లాంటి అంశాలుఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ సంవత్సరంలోనే విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొత్తంగా 1,173 వరకు ఈ తరహా కేసులు నమోదు కాగా ఒక కోటి రూపాయల వరకు ఫైన్ వేశారు.
ఎంఅర్పీ కంటే ఎక్కువ ధరలకు వాటర్ బాటిల్
మొబైల్ షాప్స్ అనంతరం బేకరీ షాపులను తనిఖీ చేయగా అక్కడ విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రధానంగా తాగే నీటి విషయంలో జరుగుతున్న మోసాలు చూసి ఖంగు తిన్నారు అధికారులు. ఊరు, పేరు లేని పలు వాటర్ బాటిళ్ళ ను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మడం కనిపించడం తో మండి పడ్డారు అధికారులు. అలాంటి వారిని అసలు ఉపేక్షించేది లేదన్నట్టు ఒక బెకరీ దుకాణానికి ఏకంగా 4 లక్షల రూపాయల ఫైన్ వేశారు. కేవలం నాణ్యత లేని, ఊరూ, పేరూ లేని వాటర్ బాటిళ్ల పై ఉన్న ఎంఅర్పీ 8 రూపాయలు ఉంటే ఆ స్టిక్కర్ తొలగించి 20 రూపాయలకు అమ్ముతున్నట్టు గుర్తించి వాళ్లపై కేసులు బుక్ చేశారు.
అంతే కాకుండా పలు స్వీట్ షాప్ ల్లో తూకాల్లో కూడా మోసాలను గుర్తించారు. స్వీట్స్ కొన్నాక వాటిని బాక్సుల్లో పెట్టే సమయంలో 100 నుంచి 200 గ్రాముల వరకు తరుగు ఉన్నట్టు గుర్తించారు. అధిక సంఖ్యలో బేకరీ దుకాణాల్లో కేకుల కింద ఉంచే అట్టముక్క తో కలిపి బరువు లెక్కేసినట్టు గుర్తించారు. అట్టముక్క ను అలానే ఉంచి బరువు తూయడంతో వినియోగదారులు మోసపోతున్నారు. ఇక బియ్యం అమ్మకాలలో ఎంఆర్పీ లేకుండా అమ్మడం, 26 కేజీలు అని కేవలం 24 కేజీల బరువుతో విక్రయిస్తున్నట్టు గుర్తించి 16 కేసులు నమోదు చేశారు.
మరోవైపు నగరంలోని కొన్ని జ్యువలరీ షాప్స్ లోనూ మిల్లీ గ్రాముల తూకాలలో తేడాలు గుర్తించి పలు కేసులు నమోదు అయ్యాయి. నిరంతరం కొత్త కొత్త మోసాలు చేస్తున్నారు. దీనిపై విశాఖ తూనికలు కొలతల డిప్యూటీ కంట్రోలర్- కె. థామస్ రవికుమార్ మాట్లాడుతూ తాను కొత్తగా ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించానని, నగరంలో పలువురు వ్యాపారులు ఎప్పటికప్పుడు సరికొత్త చీటింగ్ కు పాల్పడుతున్నారన్నారు. ఇకపై అలా జరగకుండా ఇన్ స్పెక్టర్ల అధ్వర్యంలో టీమ్స్ ను ఏర్పాటు చేసి తరచూ తనిఖీలు చేస్తామన్నారు. పదే పదే మోసాలు చేసే వారిపై నిఘా పెట్టి లైసెన్స్ లను రద్దు చేస్తామన్నారు డిప్యూటీ కంట్రోలర్.