– క్షణికావేశంతో నిండు ప్రాణాలు బలి
– ఒత్తిడిలో యువతి యువకుల బలవన్మరణాలే ఎక్కువ
– ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక శక్తి పెంపొందించుకోవాలి
– తమను నమ్ముకున్న వారి గురించి ఆలోచించరెందుకు?
దేవరాపల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రపత్రిక ) : ఒక్కరా.. ఇద్దరా.. ఎందరో యువతీ, యువకులు ఒత్తిడిలో క్షణికావేశంతో జరిగిన బలవన్మరణాలే ఎక్కువ. తమను నమ్ముకున్న వారి గురించి కనీసం ఆలోచించరెందుకని అనేకమంది తమ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తల్లడిల్లుతున్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక శక్తి ఎందుకు పెంపొందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించుకున్నారు..పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. కొద్ది నెలలు కాపురం చేశారో లేదో చిన్న విషయం మీద గొడవపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోన్ యాప్ వలలో పడి అప్పుల భారం మీద వేసుకున్నారు. సకాలంలో తీర్చకపోవడంతో ఇల్లాలి ఫోటో మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టు వైరల్ చేస్తామని బెదిరించారు నిర్వాహకులు. ఇద్దరు పిల్లల్ని అనాధలను చేసి భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చిన్నా చితక సమస్యలను కూడా తీవ్ర ఒత్తిడిలా భావించి అఘాయిత్యం. చేసుకుంటున్నారు. భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ఆలోచించినా.. ఆపద గురించి ఆత్మ బంధువులతో పంచుకున్నా.. రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం సహాయం తీసుకున్న ఈ ఘోరాలు జరిగేవి కావు.ఆత్మహత్యలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. తరచూ జరుగుతున్న ఆత్మహత్యలపై *ఆంధ్రపత్రిక* అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఓడిపోవడం తప్పు కాదు. విజయానికి అది ఒక మెట్టు అని గుర్తించక,కాలానికి తగ్గట్టుగా పరుగులు తీయలేక కొందరు.. ఆర్థిక, వ్యక్తిగత, మానసిక సమస్యలతో ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడి తనువు చాలిస్తున్నారు. బతికి సాధించుకోవాలని, ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా.. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నడుతున్నామని గుర్తించలేకపోతున్నారు. ఒకపక్క పోలీస్ యంత్రాంగం ఆత్మహత్యలొద్దు.. నిండైన జీవితమే ముద్దు అంటూ విద్యార్థి స్థాయిలోనే వ్యాసరచన పోటీలు,ర్యాలీల పేరిట అవగాహన కల్పిస్తున్నారు. అయినా ఎటువంటి మార్పు రాకపోవడం శోచనీయం. జిల్లాలో గత రెండేళ్ల గణాంకాలు పరిశీలిస్తే 90 శాతం మేర క్షణికావేశంలో ఒత్తిడితో చేసుకున్న ఆత్మహత్యలుగానే గుర్తించవచ్చు.
*మానసిక రుగ్మతులతో ఆత్మహత్యలు*
తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే విపరీత ప్రవర్తన కలిగి ఉండడాన్ని వైద్య పరిభాషలో పారా సూసైడ్ అంటారు. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్ అంటాం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు ఈ రెండు కూడా మానసిక వ్యాధుల విభాగంలో అత్యవసర చికిత్స చేయాల్సిన రోగాలుగా చెప్పుకోవచ్చు. ఆత్మహత్యలకు పాల్పడే ముందు వీరిలో కొన్ని మార్పులు గుర్తించవచ్చు. ఒంటరితనం ఇష్టపడడం, మద్యం అతిగా సేవించడం, ప్రతీకారం, తీవ్ర మానసిక ఒత్తిడిని ప్రదర్శించడం, అతిగా నిద్రపోవడం, రాత్రి సమయంలో నిద్ర పోకుండా అతిగా ఆలోచన చేయడం, అనవసర విషయాల పట్ల అతిగా స్పందించడం వంటి మార్పులను గమనించవచ్చు. మానసిక రుగ్మతలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి .
*ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి*
పలు అధ్యయనాల ప్రకారం ఎవరైతే తాను ఇక బతకడం వేస్ట్ అనే పదే పదే మాట్లాడుతారో అలాంటివారు ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటారు. ఒంటరితనాన్ని ఇష్టపడతారు, తరచూ చికాకు పడతారు, జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఒంటరిగా ఉంటారు, ఇలాంటి వారికి నూతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. యువత డిప్రెషన్ కి గురైనప్పుడు, మానసిక సమస్యలు ఎదురైనప్పుడు, వారిలో ధైర్యం నింపే విధంగా అటు ఉపాధ్యాయులు, ఇటు ఆత్మ బంధువులే నిలవాలి. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి.