విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఈ ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఒక్కో బోటులో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఈ ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఒక్కో బోటులో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి. రూ.30కోట్లకు పైగా ఆస్తినష్టం కాగా.. 3వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇంకా భారీగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ లో మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. చివరి బోటు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.బోట్లలో డీజిల్ నిండి ఉండడంతో దట్టంగా పొగ వ్యాపించింది. మంటలు చెలరేగి 40కి పైగా మరబోట్లు దగ్ధమయ్యాయని.. పోలీసులు తెలిపారు. రాత్రి 10:30 గంటలకు మంటలు చెలరేగాయని.. గాలుల తీవ్రతతో పక్క బోట్లకు వ్యాపించాయని తెలిపారు. బోట్లలో సిలిండర్లు, డీజిల్ ఉండడంతో మంటల తీవ్రత పెరిగిందని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డీసీపీ ఆనందరెడ్డి తెలిపారు. కొన్ని బోట్లు దగ్ధమయ్యాయి, మరికొన్ని తరలించాం, ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని డీసీపీ ఆనందరెడ్డి వివరించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు. ప్రమాదం తర్వాత యువకులుపరారయ్యారని.. వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.
కాగా.. విశాఖ హార్బర్ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మత్స్యకారుల బోట్ల దగ్ధంపై సీఎం జగన్ దర్యాప్తునకు ఆదేశించారు. ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించాలని మంత్రి సీదిరికి సీఎం సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని.. ప్రమాదం వెనుక ఎవరున్నా వదిలిపెట్టవద్దంటూ జగన్ అధికారులకు స్పష్టంచేశారు.
హార్బర్ చరిత్రలో..
కాగా.. హార్బర్ చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదని స్థానికులు తెలిపారు. లంగర్ వేసిన బోటులో పార్టీ జరిగిందని.. అక్కడ గొడవ జరిగడంతోనే మంటలు చెలరేగాయని పేర్కొంటున్నారు. హార్బర్లో ఈ ప్రమాదానికి అసాంఘిక శక్తులు కారణమై ఉండొచ్చని ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ పేర్కొన్నారు. 40 బోట్లు కాలిపోయాయని.. మరో 40 బోట్లు దెబ్బతిన్నాయన్నారు. ఒక్కరి వల్ల ఇంతమంది తీవ్రంగా నష్టపోయారని.. జానకిరామ్ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఇంత పెద్దయెత్తున అగ్ని ప్రమాదం జరగలేదు. బోటు కింది భాగంలో మత్స్యకారులు వలలు, డీజిల్, వంట చేసుకునే గ్యాస్, ఇతరపరికరాలు ఉంటాయి. చిన్న అగ్ని ప్రమాదం జరిగినా.. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయన్నారు.
కారణం ఎవరు..?
అయితే, ఈ ఘోర ప్రమాదానికి భిన్నమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి.. బోటు అమ్మే విషయంలో గొడవ జరిగిందని కొందరు పేర్కొంటుండగా.. అది కాదని.. గొడవ జరిగిన బోటులో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఉన్నట్లు మరికొందరు పేర్కొంటున్నారు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
చర్యలు తప్పవు..
అటు అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకార బాధితులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ ప్రమాదంలో కుట్రకోణం ఉంటే.. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే..