రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం,అక్టోబర్ 14 (ఆంధ్రపత్రిక): రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జేఏసీ మీడియా సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రేపు(శనివారం) విశాఖ గర్జనలో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలుపుతామన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఒక వర్గం మీడియా దెబ్బతీస్తోందన్నారు. మా పోరాటంలో భాగస్వామ్యం కాకపోయినా హాని చేయొద్దన్నారు. మేం అమరావతి, రాయలసీమ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ తమ పోరాటానికి సంఫీుభావం తెలపాలని మంత్రి కోరారు. విశాఖను రాజధానిగా సాధించుకుని తీరతామన్నారు.
విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల హక్కు: అవంతి శ్రీనివాస్
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల హక్కు అన్నారు. విశాఖకు రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. విశాఖలో రూ.5వేల కోట్లు పెడితే బ్రహ్మాండమైన రాజధాని అవుతుందని ఆయన అన్నారు.
అన్ని వర్గాల ప్రజల మద్దతు: జేఏసీ కన్వీనర్
ఉత్తరాంధ్ర దశాబ్ధాలుగా వెనుకబడి ఉందని జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలిపేలా విశాఖ గర్జన జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. జేఏసీ ఉద్యమం అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని జేఏసీ కో కన్వీనర్ దేవుడు అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకుని తీరతామన్నారు.