Tight Security For Tomato Crop: టమోటా.. ఇప్పుడు కాపలా ఖాయం అంటుంది. సెక్యూరిటీ లేకపోతే కష్టం అంటుంది. ఆరుగాలం కష్టపడ్డ రైతుకు దక్కనని వార్నింగ్ ఇస్తుంది. మునుపెన్నడూ లేని రీతిలో అన్యూహంగా పెరిగిన ధరతో ఈ పరిస్థితి తప్పదని రుజువుచేస్తోంది.
టమోటా.. ఇప్పుడు కాపలా ఖాయం అంటుంది. సెక్యూరిటీ లేకపోతే కష్టం అంటుంది. ఆరుగాలం కష్టపడ్డ రైతుకు దక్కనని వార్నింగ్ ఇస్తుంది. మునుపెన్నడూ లేని రీతిలో అన్యూహంగా పెరిగిన ధరతో ఈ పరిస్థితి తప్పదని రుజువుచేస్తోంది. దాదాపుగా గత నెల రోజుల్లో అంతకంతకు పెరిగి ఏకంగా రూ.150 కి చేరిన టమోటా ధర టచ్ చేసి చూడు తెలుస్తుంది అనే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో సామాన్యుడి ఇంటి భోజనంలో తాను ఒక భాగమై కనిపించే టమోటా ఇప్పుడు కనిపించకుండానే దూరమవుతోంది. ఇలా టమోటా ధర ఆకాశాన్ని అంటిపోగా ఇప్పటిదాకా ఇంతటి ధర చూడని రైతు సాగు చేసిన టమోటాను కాపాడుకోవడానికి నాన్న తిప్పలే పడుకున్న పరిస్థితి ఎదురవుతుంది. కొన్ని చోట్ల టమోటా చోరీకి గురవుతుంటే మరికొన్ని చోట్ల టమోటాను కాపాడుకునేందుకు బౌన్సర్లు కూడా రంగం దిగినట్లు తెలుస్తోంది.
మూడు రోజుల క్రితం మదనపల్లిలో జరిగిన రైతు హత్యకు కారణం పెరిగిన టమోటా ధర.. టమోటా వ్యాపార లావాదేవీలు కూడా కారణమన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా సరిహద్దులుని కర్ణాటకలో టమోటా కు పెరిగిన డిమాండ్ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
కుప్పం సరిహద్దులోని కర్ణాటకలోని అతిపెద్ద టమోటా మార్కెట్.. కోలార్ లో టమోటా ధర అనూహ్యంగా పెరిగింది. కోలార్ మార్కెట్ నుంచి బంగ్లాదేశ్ తోపాటు పంజాబ్, ఢిల్లీ తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు దాదాపు 4వేల మెట్రిక్ టన్నుల టమోటా ఎగుమతి అవుతోంది. దీంతో మంచి రేటు కూడా రైతులకు వస్తోంది. ఏపీ కర్ణాటక బార్డర్లో టమోటా సాగు చేసిన రైతులకు గతంలో ఎప్పుడూ రాని ధర ఇప్పుడొస్తుంది.
బంగారు గనుల ప్రాంతంలో ఎర్ర బంగారంగా మారిన టమోటా..
కోలార్ గోల్డ్ మైన్స్. కేజిఎఫ్ గా బంగారు గనుల ప్రాంతంగా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎర్రని టమోటా రైతాంగానికి బంగారు పంటగా మారింది. టమోటా సాగు చేసిన రైతులకు మునుపెన్నడూ లేని ధర లభిస్తుండటం ఇందుకు కారణం. కోలార్ మార్కెట్ లో కిలో టమోటా ధర రూ.150 కు పైగానే ఉండటంతో టమోటా సాగుచేసిన రైతుకు కాసులపంటే పండుతోంది. కోలార్ జిల్లా పరిధిలోని ముల్ బాగల్, మాలూర్, కేజీఏఫ్, బంగారు పేట్ నియోజకవర్గాల్లో టమోటా సాగుచేసిన రైతులు ఇప్పుడు పంటలను కాపాడుకోవడం సమస్యగా మారింది.
టమోటా సాగుచేసిన పొలాల్లోనే రాత్రింబవళ్లు ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు దొంగల బెడద మరోవైపు వన్యప్రాణుల ముప్పు ఉన్నా పంట పొలాల్లో నిప్పు రాజేసుకుని కాపలా ఉంటున్న పరిస్థితి నెలకొంది. కంటికి రెప్పలా టమోటా పంటను కాపాడుకునే పరిస్థితి నెలకొంది. పొలంలోనే తలదాచుకుని దోమల బెడదకు జెట్ కాయిల్ ను కూడా వెలిగించుకుని కునుకు తీస్తున్నారు. ఇంకా టార్చ్ లైట్ వేస్తూ పొలం చుట్టూ తిరుగుతూ రాత్రంతా గుర్ఖా లాగా కాపలా కాస్తూ చెట్టు చెట్టును కాపాడుకుంటుండం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.