ఆ నాలుగు ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంది
- పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనగలము
- ఉక్రెయిన్‌ను బలగాలను పంపించే ఉద్దేశం మాకు లేదు
- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
మాస్కో,డిసెంబర్ 20 (ఆంధ్రపత్రిక): ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలను రష్యా ఇటీవల తమ దేశంలో ఏకపక్షంగా విలీనం చేసుకుంది.అయితే ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు ‘అత్యంత క్లిష్టంగా’ ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. కొత్త ముప్పులను ఎదుర్కొనేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లట్లేదన్న ప్రచారం జరుగుతోన్న సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం బెలారస్ పర్యటనలో ఉన్న పుతిన్.. రష్యాలో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్ డే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ‘’ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. అక్కడి ప్రజలకు భద్రత కల్పించేలా, పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనేలా సరిహద్దుల్లో నిఘాను పెంచండి. అలాగే స్వదేశంలో ఉన్న దేశ ద్రోహులపైనా నిఘా పెట్టండి’’ అని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్‌ను పుతిన్ ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిరచాయి.ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతోన్న వేళ.. పుతిన్ సోమవారం బెలారస్ వెళ్లి ఆ దేశాధ్యక్షుడు లుకాషెంకోతో భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు ఆ దేశంలో పర్యటించడం మూడున్నరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో బెలారస్‌ను కూడా యుద్ధరంగంలోకి దింపేందుకు ఒత్తిడి చేయడానికే పుతిన్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను మాస్కో ఖండిరచింది. అటు లుకాషెంకో కూడా దీనిపై స్పందిస్తూ.. ‘’ఉక్రెయిన్‌ను బలగాలను పంపించే ఉద్దేశం మాకు లేదు’’ అని స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌కు చెందిన ఆ నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరులో పుతిన్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత అక్కడ మార్షల్ చట్టాన్ని కూడా అమల్లోకి తెచ్చారు. అయితే ఈ నిర్ణయాన్ని ఐరాస సహా పశ్చిమ దేశాలు ఖండిరచాయి.