450 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రసిద్ది చెందిన దేవాలయం..!
బచ్చు పేట శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థితిగతులు మారేదెన్నడు?
కార్యనిర్వహణాధికారి ఇక్కడే పూర్తి సేవలందించాలని భక్తుల ఆవేదన..!
ముఖ్యమైన పర్వదినాలు, రెండవ శనివారం ఆలయ పరిసరాలు ట్రాఫిక్ జామ్ తో విలవిల..!
మచిలీపట్నం నవంబర్ 13 ఆంధ్ర పత్రిక.:
వక్కలంక వెంకట రామ కృష్ణ, స్టాఫ్ రిపోర్టర్..
ఏడుకొండల వెంకన్నా, నీ గుడి తీరు, మారేది ఎన్నడు? అని భక్తులు ఆవేదన చెందుతున్నారు. బచ్చుపేట శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం 450ఏళ్ల పైగా ఘన చరిత్ర కలిగిన పురాతన దేవాలయం. ఈ ఆలయానికి అనుసంధానంగా భ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయం కూడా ఉంది. కార్తీక మాసం, సోమవారాలు ఈ ఆలయం కూడా నిత్యం శివ నామ స్మరణతో అలరారుతుంది. నిత్యం పూజ, అర్చన, అభిషేకం నిర్వహిస్తారు. పర్వ దినాలలో, రెండవ శనివారం భక్త సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న వితరణ కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తుంది.
ఇలాంటి పేరెన్నిక గన్న దేవాలయాలకు కార్యనిర్వహణాధికారి పూర్తిగా సేవలు ఇక్కడే అందించాలని భక్తుల ఉవాచ.
కానీ ఇక్కడ కార్యనిర్వహణాధికారికి మొత్తం 3 గుడులు అదనపు బాధ్యతలుగా ఉండడం వల్ల, అవి కూడా నగరానికి దూరంగా ఉండడం వల్ల కార్యనిర్వహణ లో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏ దేవాలయానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా బచ్చు పేట వెంకటేశ్వర దేవాలయం తో బాటు , మోపిదేవి వల్లీ దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ఈఓ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాన బాధ్యత బచ్చుపేట వెంకటేశ్వర దేవాలయానిదే. వీటికి తోడు అదనపు బాధ్యతల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దానివల్ల బచ్చుపెట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సరైన న్యాయం జరగడం లేదని భక్తుల ఆవేదన. దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో విఫలం అవుతోందనే చెప్పొచ్చు.
పర్యవేక్షణా లోపం, సిబ్బంది బాధ్యతారాహిత్యం:
వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పర్యవేక్షణా లోపం, సిబ్బంది బాధ్యతారాహిత్యం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది.
పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు లేకుండా సిబ్బంది పనిచేస్తే ఆ పాఠశాల స్థితిగతులు ఎలా ఉంటాయో, ఆలయానికి కార్యనిర్వాహణాధికారి అలంకార ప్రాయంగా ఉంటే కూడా అలాగే ఉంటుందని చెప్పొచ్చు. బడికి ,గుడికి పర్యవేక్షణ ఉంటేనే అవి సక్రమంగా, సవ్యంగా పనిచేస్తాయి.
రెండవ శనివారం దేవాలయ పరిసరాలలో ట్రాఫిక్ సమస్యలు:
ప్రతి నెల రెండవ శనివారం, శనివారాలు, పర్వదినాలు వచ్చాయంటే చాలు, దేవాలయ పరిసరాలలో దాదాపు గంటన్నర పైగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. సామాన్య మానవుడు కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి లేనంత రద్దీగా ఉంటుంది. వీటికి తోడు నిత్యం కెనడీ రోడ్డు వెంట వెళ్లే ద్విచక్ర వాహనాలు, కార్లు రద్దీ చెప్పక్కరలేదు. దేవాలయానికి వెళ్లే మార్గం అష్ట దిగ్బంధనమే. దేవాలయానికి అన్న వితరణ కోసం భక్తులు వచ్చే రహదారి మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల వరకు విపరీతమైన రద్దీతో కిక్కిరిసి ఉంటుంది. అలాంటి సమయంలో దేవస్థాన అధికారులు పోలీస్ బీట్ ఏర్పాటు చేయిస్తే, పరిస్థితి మరోలా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ కి కొంతవరకు కట్టడి వేసినట్టు అవుతుంది. ముఖ్యమైన పర్వదినాల్లో పోలీస్ బీట్ అవసరమైన ఎడల దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పోలీస్ శాఖ వారికి ముందస్తు సమాచారం అందిస్తే పోలీస్ శాఖ ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని పోలీస్ బీట్ ఏర్పాటు చేస్తుంది. దేవస్థాన కార్యనిర్వహణాధికారికి రెండు ,మూడు దేవాలయాలు ఉండడం వల్ల పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అదీగాక రద్దీగా ఉండే దేవస్థాన ప్రాంగణంలో కేవలం స్వచ్ఛందంగా వడ్డన చేసే వాలంటీర్లు, కొద్దిగా దేవస్థానం సిబ్బంది తప్ప ఆ ప్రాంగణంలో ఇంకెవరూ కనపడరు. లెక్కకు మిక్కిలిగా వచ్చే భక్తులను అడ్డు, అదుపు చేయడం కూడా కష్టసాధ్యమైన విషయమే. కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాము కి కోపం అన్న చందంగా పరిస్థితులున్నాయి. ఇలాంటి సమయంలో దేవస్థాన ఈవో రెండవ శనివారం కార్యాలయానికి వచ్చినా, అన్న సమారాధన జరుగుతున్న సమయంలో పర్యవేక్షణ అధికారిగా, ఆ ప్రాంతంలో లేకపోవడం వల్ల కూడా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అన్న సమారాధన పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించాలి. కానీ అలా జరగడం లేదని భక్తుల ఆవేదన..
దేవాలయాన్ని శ్రద్ధగా పట్టించుకుంటే ఈ సమస్య ఏర్పడుతుందా? అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో ప్రముఖమైన పేరు పొందిన దేవాలయాల్లో, రద్దీగా ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న ఈవోలకు అదనపు బాధ్యతలు పెను సవాలుగా మారుతున్నాయి. అదీగాక కృష్ణా జిల్లా ముఖ్య పట్టణం మచిలీపట్నం.జిల్లా ప్రధాన కేంద్రం. ఇలాంటి చోట పరిస్థితులు భిన్నంగా ఉండడం వల్ల భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఇప్పటికైనా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఈ విషయాన్ని గుర్తించి అదనపు బాధ్యతలు ఉన్న కార్యనిర్వహణాధికారులకు, ఆ బాధ్యతల నుండి విముక్తి కల్గించి వారిలో పని ఒత్తిడిని కూడా తగ్గించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సిబ్బంది కొరత ఉన్న యెడల ప్రత్యామ్నాయంగా, రద్దీగా లేని దేవాలయాల నుండి కార్యనిర్వహణాధికారులను, మోపిదేవి లాంటి రద్దీగా ఉన్న దేవాలయాల్లో నియమించుకున్నా తప్పులేదు. జీతం ఇక్కడ, పని అక్కడ అన్న చందంగా ఉన్న కార్యనిర్వహణాధికారులకు అదనపు బాధ్యతలు తప్పించి, జీతము తీసుకుంటున్న ప్రాంతంలోని శాశ్వత ప్రాతిపదికన బాధ్యతలు ఏర్పాటు చేస్తే ఈ విధమైన ఇబ్బందులు భక్తులకు కలగవు. ప్రభుత్వం ఈ విషయం గుర్తించి రద్దీగా ఉండే దేవాలయాలకు ప్రత్యేకంగా కార్యనిర్వహణాధికారిని శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న దేవాలయం లోనే విధులను కేటాయించి, అక్కడే పని చేసే లాగా చర్యలు తీసుకోవాలి అని, భక్తులు కోరుతున్నారు. అప్పుడే దేవాలయాల మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా నిత్య శోభితమై, అంగరంగ వైభవంగా, కొంగొత్త కాంతులతో వెలుగొందుతాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ దిశగా పయనించి దేవస్థానాల దశను మారుస్తుందని ఆశిద్దాం..!