నిబంధనలన్నీ నా కోసమేనా?: పవన్
‘’అసూయతో వైకాపా ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయి
వైకాపా టికెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు మానండి
రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అని కౌంటర్
అమరావతి, డిసెంబర్ 9 (ఆంధ్రపత్రిక): జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైకాపా నేతలు చేసిన విమర్శలపై పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా మరోసారి స్పందించారు.నిబంధనలు ఒక్క పవన్‌కల్యాణ్ కోసమేనా? అని ప్రశ్నించారు. ‘వారాహి’ వాహనం మాదిరిగా ఆలీవ్ గ్రీన్ కలర్లో ఉన్న వాహనాల ఫొటోలను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. ‘’అసూయతో వైకాపా ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయి. వైకాపా టికెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఏపీలో లంచాలు, వాటాల వేధింపుల వల్ల ‘కారు నుంచి కట్ డ్రాయర్ కంపెనీల’ దాకా పక్క రాష్ట్రానికి తరలిపోయాయి’’ అని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు.‘వారాహితో యుద్ధానికి సిద్ధం అంటూ పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన వాహనానికి నిషేధిత రంగు వేశారు’ అని పేర్ని నాని ఆరోపించారు. గురువారం ఆయన ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు వినియోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోంది. అదే రంగు ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వదు. మీరు ఎటూ రంగు మార్చాలి కదా… అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుంది. మీరు తెదేపాతో కలిసి వెళ్లేవారే కదా? ఇప్పుడేదో ప్రధాని మోదీ చెప్పడంతో నాలుగు రోజులు ఆగారు కదా. వ్యాన్లతో ఎన్నికల యుద్ధం అయిపోతుందనుకుంటే ప్రతి ఒక్కరూ వాటినే కొనేస్తారు. నేనూ కొనలేనా? ఇలాంటివి సినిమాల్లో అయితే బాగుంటాయి’ అని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని వ్యాఖ్యలపై పవన్ స్పందించారు.