పోడియం, రెయిలింగ్ వంటివన్నీ తొలగింపురేపటికల్లా అన్నిచోట్లా మార్పులు
విశాఖపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్పులు చేయకముందు ఇలా
అమరావతి: రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటిష్ వారసత్వ రాచరిక వ్యవస్థకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వస్తి పలికారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే ప్రత్యేక ఛాంబర్, రెయిలింగ్ వంటివన్నీ తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా జారీ చేసిన ఆదేశాలతో ఆదివారం నుంచే ఈ మార్పులు మొదలయ్యాయి. ఇప్పటివరకు సబ్‌రిజిస్ట్రార్ పోడియం ఎత్తుగా, అక్కడ చెక్కలతో కూడిన రెయిలింగ్ ఉండేది. ఆ ఛాంబర్లోకి వెళ్లకుండా చిన్న తలుపు కూడా ఉండేది. అందులో సబ్‌రిజిస్ట్రార్ ఎత్తులో కూర్చునేవారు. క్రయ విక్రయాలకు వచ్చినవారు ఎవరైనా సరే.. సబ్‌రిజిస్ట్రార్ ముందు నిల్చొని ఉండాల్సిందే. ఇప్పుడిదంతా మారుస్తున్నారు.
పోడియం, రెయిలింగ్ తొలగించిన తర్వాత ఇలా
కూర్చోబెట్టి.. నీరు, టీ ఇచ్చి
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల మాదిరిగానే సబ్రిజిస్ట్రార్లు కూడా కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎత్తయిన కుర్చీ తొలగిస్తున్నారు. వారి ముందు సామాన్యులూ కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రయ, విక్రయదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తే వారికి తాగునీరు అందించడంతో పాటు వీలైతే టీ, కాఫీ అందించాలని మెమోలో పేర్కొన్నారు.
మంగళవారం నాటికి సిద్ధం!
ఈ మేరకు విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు తదితర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుకు తగ్గట్లు ఆదివారం మార్పులు చేశారు. సోమవారం సెలవు రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా 290 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్పులు చేసి, మంగళవారం నాటికి స్నేహపూర్వక కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు చేస్తున్నారు.