ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్లో రెస్క్యూ టీం చేపట్టిన అలుపెరగని ప్రయత్నాలకు నా అభినందనలు! వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి! ప్రమాదవ శాత్తు టన్నెల్లో చిక్కుకున్న మొత్తం 41 మంది కార్మికులు సొరంగం నుండి సురక్షితంగా బయటపడ్డారని నేను ఉపశమనం పొందాను. టన్నెల్ ఆపరేషన్ విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం జగన్. ఈ విషయాలన్ని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
ఉత్తరకాశీ టన్నల్లో పనికోసం పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు కార్మికులు. అయితే ఇక్కడ వారి తప్పిదం ఏమీలేదు. ముమ్మాటికీ ప్రమాదవశాత్తు జరిగిన దురదృష్ట సంఘటనే ఇది. విధి వక్రీకరించి ఆడుకున్న విషాదపు ఆటలో దాదాపు రెండు వారాలకు పైగా గర్భాంధకారంలో గడిపిన 41 మంది కార్మికులు మంగళవారం ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అంతర్జాతీయ సాంకేతికతను ఉపయోగించి వీరిని బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి చీకటి సొరంగం నుంచి బయటకు వచ్చి సూర్యుడిని చూసే అనుభూతిని తిరిగి పొందారు. బయటి ప్రపంచంలోని స్వేచ్ఛావాయువులను హాయిగా పీల్చుకున్నారు.
ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల 12 మీటర్ల మేర శిథిలాలలో డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. ఈ డ్రిల్లింగ్ పూర్తైన వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో యావత్ దేశం వీరి ధైర్యసాహసాలకు సలాం కొడుతోంది. సాధారణంగా మన ఇంట్లో నిమిషం పాటు కరెంట్ పోయి గాలి ఆడకుండా ఉంటేనే తబ్బిబ్బైపోతాం. ఎప్పుడెప్పుడు కరెంట్ వస్తుందా అని పదిసార్లు మనలో మనమే అనుకుంటూ చికాకు మధ్య గడుపుతాం. అలాంటిది పొట్టకూటి కోసం పోయి చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన ఈ కార్మికులను చూసి సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకూ అందరూ ప్రశంసిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ సీఎం ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.