పార్లమెంటులో ఆగని ప్రకంపనలు
మణిపూర్‌పై చర్చకు విపక్షాల పట్టు
దిగిరాని మోడీ సర్కార్
మధ్యే మార్గంపై విపక్షాల ఆలోచన
న్యూఢల్లీి,అగస్టు 3 : పార్లమెంట్లో మణిపూర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో గురువారం విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఎం సహా విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాని సభకు రావాలని కోరుతూ వాకౌట్కు ముందు విపక్ష ఎంపీలు సభలో నినాదాలతో హోరెత్తించారు. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ గత కొద్దిరోజులుగా విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లు తున్నాయి. ఈ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ గురువారం రెండోసారి విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు లోక్‌సభలోనూ మణిపూర్ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మణిపూర్, హరియాణలో హింసాకాండపై బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో బీజేపీనే గందరగోళం సృష్టిస్తోందని, కాషాయ నేతలకు ప్రజాస్వా మ్యంపై విశ్వాసం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌ను అపహాస్యం చేస్తున్నారని, ఆ పార్టీ ప్రతి చోటా విభజించి పాలించే రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. మణిపూర్ హింసాకాండపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా ఓ అడుగు వెనుకకు తగ్గాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత నెల 20న ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వానికి ఓ మధ్యేమార్గ పరిష్కారాన్ని సూచించి, పార్లమెంటులో ప్రతిష్టంభనకు తెర దించేందుకు ముందుకొచ్చాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా గురువారం మధ్యాహ్నం తెలిపిన వివరాల ప్రకారం, మణిపూర్ సమస్యపై నిరంతరాయంగా చర్చించేందుకు, ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రతిపక్ష ఇండియాపక్షాలు సభా నేతకు ఓ మధ్యేమార్గ పరిష్కారాన్ని సూచించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సూచనను అంగీకరిస్తుందని ఈ పార్టీలు ఆశిస్తున్నాయి. మణిపూర్‌లో మెయిటీలు, కుకీల మధ్య మే 3న ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు శని, ఆదివారాల్లో మణిపూర్‌లో పర్యటించి, స్థానిక పరిస్థితులను అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఎంపీల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, మణిపూర్ సమస్యపై ఓ నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న వీడియో పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో మణిపూర్ సమస్యపై పార్లమెంటులో చర్చించాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెప్తోంది. మణిపూర్ సమస్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడతారని చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఉభయ సభలను స్తంభింపజేస్తున్న ఇరు పక్షాల తీరును తప్పుబడుతూ లోక్ సభ సభాపతి ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.