- పరస్పర విరుద్ద తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు
- హిజాబ్ ధారణను నిషేధించడాన్ని సమర్థించిన జస్టిస్ గుప్తా..
- తిరస్కరించిన జస్టిస్ ధూలియా
- చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి విచారణ బదలాయింపు
- కర్నాటకలో నిషేధం కొనసాగిస్తామన్న ప్రభుత్వం
న్యూఢల్లీి,అక్టోబర్ 13 అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును ఇవ్వలేకపోయింది.10 రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం హిజాబ్ ధారణను నిషేధించడంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. హిజాబ్ ధారణను నిషేధించడాన్ని జస్టిస్ గుప్తా సమర్థించగా, జస్టిస్ ధూలియా తిరస్కరించారు. విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ జస్టిస్ సుధాంశు ధూలియా గురువారం తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు మార్చిలో ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా ధ్రువీకరించారు. వివాదంపై తదుపరి విచారణ జరిపేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌కు నివేదించారు. జస్టిస్ ధూలియా మాట్లాడుతూ, హిజాబ్ ధారణ అనేది ఓ ఛాయిస్ అని, అంతకన్నా ఎక్కువ కానీ, తక్కువ కానీ కాదని తెలిపారు. బాలికల విద్య గురించిన ఆలోచన తన మనసులో ప్రధానంగా ఉందని చెప్పారు. తాను తన సోదర న్యాయమూర్తితో గౌరవప్రదంగా విభేదిస్తున్నానని తెలిపారు. జస్టిస్ గుప్తా మాట్లాడుతూ, ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. పిటిషన్లను తోసిపుచ్చుతూ, పిటిషనర్లకు 11 ప్రశ్నలను సంధించారు. కర్ణాటక హైకోర్టు తీర్పుతో తాను ఏకీభవిస్తు న్నానని చెప్పారు. వివాదంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తామని జస్టిస్ ధూలియా చెప్పారు. కర్ణాటకలోని ఉడుపిలో ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థినులు హిజాబ్ ధరించి, తరగతి గదుల్లో ప్రవేశించడాన్ని కళాశాల యాజమాన్యం తిరస్కరించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ వివాదం ముదరడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాల్లో తరగతి గదుల్లో హిజాబ్, మతపరమైన వస్త్రాల ధారణను నిషేధించింది. ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు మార్చిలో తీర్పు చెప్పింది. మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్పలేదని తెలిపింది. కర్ణాటకలో హిజాబ్ వివాదాన్ని రెచ్చగొడుతున్న శక్తులపై వేగంగా, సమర్థవంతంగా దర్యాప్తు చేయాలని చెప్పింది. సాంఘిక అశాంతిని సృష్టించేందుకు అదృశ్య శక్తులు పని చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కర్నాటక హైకోర్టు సమర్థించగా.. తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపగా.. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేసు ఇంకా పెండిరగ్‌లో ఉన్నందున పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్‌పై నిషేధం యథావిధిగా కొనసాగుతుందని కర్నాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువడినా.. దాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే, తాము మెరుగైన తీర్పును ఆశిస్తున్నామని.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు హిజాబ్, బురఖా వద్దని డిమాండ్ చేస్తున్నారన్నారు.