వారి తీరుపై నివేదికలు సిద్ధం
పోటీ చేయడానికి వస్తే కొట్టారు
గూడూరు : వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు.
చట్టాన్ని చేతిలోకి తీసుకుని విర్రవీగారు. ప్రజా ప్రయోజనాలు తోసిరాజని ఫక్తు రాజకీయ నాయకుల్లా చలామణి అయ్యారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా చెలరేగారు. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. అందినకాడికి దోచేశారు. ఇలా వారి కదలికలపై నిఘా కన్ను ఆరా తీస్తోంది. తెదేపా అధికారంలోకి రావడంతో ఆయా అధికారులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు. వారి తీరుపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
పురపాలిక ఎన్నికల్లో మరో సీఐ బెదిరింపులు
నాయుడుపేటలో పనిచేసిన మరో సీఐ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను బెదిరించి భయపెట్టారు. పురపాలక ఎన్నికల్లో తెదేపాకు చెందిన బీసీ నేతల మునిరాజాపై వైకాపా నేత కామిరెడ్డి రాజారెడ్డి దాడి చేసి భయపెట్టినా తిరిగి మునిరాజాను బెదిరించిన పరిస్థితి. వైకాపా నేతలు పట్టణంలో హల్చల్ చేసినా ప్రతిపక్ష పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు. పోటీ చేస్తే ‘ఖబడ్దార్.. మీపై గంజా కేసులే..’ అంటు భయపెట్టారు. ఇసుక, మట్టి, మాఫియా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. వసూళ్లలో కొంత భాగం నియోజకవర్గ ప్రతినిధి గన్మెన్లు, డ్రైవర్లకు మామూళ్ల ఏర్పాటు చేయించారు.
పసుపు చొక్కా విప్పకుంటే జైలుకే..
వైకాపా నేతలకు అంటకాగిన నాయుడుపేటలో పనిచేసిన ఓ ఎస్సై పురపాలిక ఎన్నికల్లో ఇష్టారీతిన వ్యవహరించారు. ఏకంగా ఎస్సీ నేత దార్ల రాజేంద్రను చొక్కా విప్పించే వరకు వదలిపెట్టలేదు. లేకుంటే జైలుకెళ్తారని బెదిరించారు. స్థానిక ర.భ అతిథిగృహం వద్ద అడ్డుకుని అక్కడి నుంచి ఏకంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు.
‘ఎమ్మెల్యేపైనే పోస్టు పెడతావా’అంటూఎస్సై..
ఓజిలిలో పనిచేసిన ఓ ఎస్సై సూళ్లూరుపేటలో పనిచేసిన సమయంలో హల్చల్ చేశారు. ఆయనకు ఎదురు తిరిగితే కేసులే అన్నట్లు వ్యవహరించారు. ఆయన అక్రమాలు బయట పెట్టిన వైకాపా నేత సునీల్‌రెడ్డి, బాబురెడ్డిలను బెదిరించి స్టేషన్‌కు పిలిచి కేసులు పెట్టారు. వారు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం నడిచింది. బాబురెడ్డి ఎమ్మెల్యేపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు బెదిరించి కొట్టారు.