సిరిసిల్ల: ఆ చిన్నారి నవ్వులతో ఇళ్లంతా సందడిగా ఉండేది. తన ముద్దుముద్దు మాటలతో అందరినీ పలకరిస్తూ పాఠశాలకు వెళ్లేందుకు తయారైంది. ‘అమ్మా వెళ్లొస్తా’ అంటూ..
పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకొని బస్సు ఎక్కి పాఠశాలకు బయలుదేరింది. అంతలోనే ఆ చిన్నారిని బస్సు రూపంలో మృత్యువు కబలించింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామానికి చెందిన రాజు, వెంకటలక్ష్మి దంపతులకు గత కొన్నేళ్లుగా సంతానం లేదు. వీరు మనోజ్ఞ(5) అనే చిన్నారిని పెంచుకుంటున్నారు. రాజు ఉపాధి కోసం సౌదీ వెళ్లగా.. వెంకటలక్ష్మి కుమార్తెను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. రోజూ మాదిరిగానే సోమవారం కూడా వెంకటలక్ష్మి తన కుమార్తెను తయారుచేసి స్కూల్కు పంపించింది. పాఠశాలలోని తరగతి గదికి వెళుతుండగా, ప్రమాదవశాత్తూ అక్కడ ఉన్న ఓ బస్సు వెనక టైర్ల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి కుటుంబసభ్యులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.