మచిలీపట్నం నవంబర్ 10 ఆంధ్ర పత్రిక.
వక్కలంక వెంకట రామ కృష్ణ, స్టాఫ్ రిపోర్టర్..
నగరంలో ట్రాఫిక్ రోజురోజుకీ పెరిగిపోతోంది.అస్తవ్యస్త ట్రాఫిక్ వల్ల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైనా వాహనదారుల భద్రతా చర్యలు శూన్యం. దానికి తోడు ప్రధాన రహదారులలో సైతం కొంతమంది యువత విచ్చల విడి డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొంతమంది, ద్విచక్ర వాహన దారులు , ఆటో డ్రైవర్లు అడ్డు, అదుపు లేకుండా ప్రయాణిస్తున్నా ట్రాఫిక్ పోలీసులకు ఏమీ పట్టడం లేదు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ సెంటర్ వద్ద, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద, డి. మార్ట్ వద్ద తదితర ప్రాంతాల్లో కొంతమంది ద్విచక్ర వాహనదారులు అతి వేగంగా ప్రయాణిస్తున్నారు. దానికి తోడు కొంతమంది ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు సైతం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయాందోళనలో నగర ప్రజలు ఉన్నారు. మైనర్లు సైతం వాహనాలు డ్రైవ్ చేయడం జరుగుతోంది. ప్రాణం చాలా విలువైనది. కానీ కొంతమంది అజాగ్రత్త వల్ల నిండు ప్రాణాలు ప్రమాదాలకి గురికావడమో ,గాలిలో కలిసిపోవడమో జరుగుతుంది.
ప్రధానంగా ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ప్రధాన పార్కు వద్ద వారాంతం లో విపరీతమైన రద్దీ ఉంటుంది. అప్పుడు మాత్రం అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు దర్శనం ఇస్తారు. మార్కెట్ పనుల నిమిత్తం, విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్ళ వలసిన ఉద్యోగ సిబ్బందితో రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి.
నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసుల జాడ అక్కడక్కడే కనిపిస్తుంది. అది కూడా నామ మాత్రమే. ఉదయం, సాయంత్రం వేళ మాత్రం ట్రాఫిక్ పోలీసులు హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రి 7 దాటితే వారి జాడ , కాన రావడం లేదు అని నగర ప్రజలు అనుకోవడం గమనార్హం. ఏదో మొక్కుబడిగా డ్యూటీ చేసాం అనే రీతిలో వారి వ్యవహార శైలి ఉంటుం దని నానుడి.
ముఖ్యంగా బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రహదార్లు రద్దీగా ఉన్న సమయంలో కూడా ట్రాఫిక్ పోలీసుల జాడ మచ్చుకైనా కనిపించదు. దానికి తోడు అడ్డ దిడ్డంగా రోడ్లపైనే ఆటోలు, వాహనాలు నిలపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎంతో బాధ్యతాయుతంగా ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించేవారు. ఇప్పటికీ అలాంటి జవాబుదారీతనంతో పనిచేసే ట్రాఫిక్ పోలీసులు లేకపోలేదు. రద్దీగా ఉండే సమయంలో ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ పోలీసుల జాడ లేకపోవడం పట్ల నగర ప్రజలు’ ఔరా ‘ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
దానికి తోడు నగరంలో ప్రధాన కూడళ్లు అయిన జిల్లాపరిషత్ సెంటర్, లక్ష్మి టాకీస్ సెంటర్, పరాసు పేట , బస్ స్టాండ్ సెంటర్, రేవతి థియేటర్ సెంటర్, కోనేరు సెంటర్ ఇత్యాది ప్రాంతాల్లో సిగ్నల్ లైట్ వ్యవస్థ లేకపోవడం వల్ల తరుచూ వాహనదారులు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు.ప్రైవేట్ డాక్టర్లు ప్రాక్టీస్ చేసే సెంటర్లు రోగులతో కిక్కిరిసి ఉంటాయి. అలాంటి చోట పోలీస్ బీట్ అత్యంత ఆవశ్యకం అంటున్నారు. అలాగే బైపాస్ రోడ్డు వెళ్లే దారిలో డి మార్ట్ వద్ద ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. రద్దీగా ఉండే రాత్రి వేళల్లో కూడా ఏదో డ్యూటీ చేసామని ‘మమ ‘ అనిపిస్తున్నారు. రేవతి సెంటర్, కోనేరు సెంటర్ తదితర ప్రాంతాలు రాత్రి వేళల్లో విపరీతమైన రద్దీగా ఉంటాయి. అక్కడ రాత్రి ఎనిమిది గంటలైతే చాలు పోలీసు జాడే కనపడదు.
ఎవరైనా వీఐపీలు వచ్చినప్పుడు, బందోబస్తు పుష్కలంగా ఉంటుంది. మిగతా సమయంలో బాధలు పడేది నగర ప్రజలే. ప్రమాదాలు జరగనంత వరకు బాగానే ఉంటుంది కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అతి
వేగం అనర్ధదాయకం అని తెలిసినా కొంతమంది యువత అత్యుత్సాహంగా నగరవీధుల్లో వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలకు కారణం అవుతోంది. దీనికి కళ్లెం వేసే నాధుడు ఎవరు? అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పసిపిల్లలు వృద్ధులు రోడ్లు దాటాలంటే పరిస్థితి ప్రళయంగా మారింది.ఇటీవల కాలంలో నగరంలో ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి.
అంకిత భావంతో పనిచేసే సిబ్బంది సేవలు ప్రశంసనీయం:
జిల్లా పోలీస్ కార్యాలయానికి దగ్గరలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద అంకితభావంతో మధ్యాహ్నం 12 దాటినా పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుని అభినందించాల్సిందే. ఇలాంటి వారు అక్కడక్కడ అంకిత భావంతో పనిచేస్తున్నారు.
డ్యూటీలు కేటాయించడంలో పారదర్శకత పాటించాలి:
ఇప్పటికైనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పటిష్టమైన ప్రణాళికలతో ట్రాఫిక్ పోలీసులకు విధులు, బాధ్యతలు కేటాయించి బిజీగా ఉండే ప్రాంతాల్లో అత్యంత పారదర్శకంగా వారు పనిచేసేలాగా కృషి చేయాలని అనుకుంటున్నారు. అంతేగాక పర్యవేక్షణ కూడా పటిష్టంగా నిర్వహించాలి. వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరికి రోడ్లపై 3 లేక 4 గంటలు మాత్రమే డ్యూటీలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇబ్బందులు కలగని రీతిలో వారికి సమయానుకూలంగా డ్యూటీలు కేటాయిస్తే వారిపై తలకు మించిన భారం పడదు. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులకు నగరంలో కట్టుదిట్టంగా డ్యూటీలు కేటాయించాలని కోరుతున్నారు. నూతన సంస్కరణలకు శ్రీ కారం చుట్టడం, సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడం లాంటి చర్యలు తీసుకోవాలి.
మరి ఆ దిశగా పోలీస్ శాఖ ప్రయాణించి, నగరం యొక్క దశ మారుస్తుందని ఆశిద్దాం…!