హారతులు సిద్దం చేసిన చెల్లెళ్లు..
నేడే రాఖీ పౌర్ణమి..! నగరం లో రాఖీ ల సందడి..! అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక..!
మచిలీపట్నం ఆగస్టు 30 ( ఆంధ్ర పత్రిక ) వక్కలంక వెంకట రామకృష్ణ ,స్టాఫ్ రిపోర్టర్.!
రాఖీలు కట్టించుకున్న ఆనందంలో అన్నయ్యలు.
నేడే శ్రావణ పౌర్ణమి. నేడు రాఖీ పౌర్ణమి అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్ల ,అక్కా తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రత్యేకత సంతరించుకుంటుంది. కులమతాలకు అతీతంగా సోదర సోదరీమణుల వాత్సల్యం, అభిమానం,అనురాగం, ప్రేమ, ఆదరణల కలయికే రాఖీ పౌర్ణమి. తన అన్నకు రాఖీ పౌర్ణమి రోజు చెల్లెలు రాఖీ కడుతుంది. అన్న చెల్లికి చక్కని యశస్సుతో సిరిసంపదలతో, ఆనందంగా భోగభాగ్యాలతో వర్ధిల్లు తల్లి అంటూ దీవించి బహుమతి ఇస్తాడు.

దుకాణాలలో రాఖీలు కొనుగోలు చేస్తున్న మహిళలు..!
అన్నా చెల్లెలు ఒకే ప్రాంతంలో ఉన్నా, దూర ప్రాంతాల్లో ఉన్నా రాఖీ రోజు విధిగా కలుసుకుంటారు. నిజంగా అన్నా చెల్లెళ్ళ ప్రేమంటే ఇదే కదా..! చెల్లి తన అన్నకు రాఖీ కట్టి, అన్న ఆశీసులు పొందుతుంది. చెల్లికి, బావకి బట్టలు పెట్టి, వారికి ఆశీస్సులు అందిస్తాడు అన్న.. అన్న ఆశీస్సులు అందుకున్న ఆ చెల్లి ఆనందభరితురాలు అవుతుంది. అన్న అంటే తన దృష్టిలో తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. అలాంటి అన్న ఆశీర్వాదం కోసం పరితపించే చెల్లి, చెల్లికి ఆశీస్సులు అందించాలని తపనపడే అన్న వీరిద్దరూ కలిసే ఆ మధురమైన రోజు ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది. చెల్లికి దీవెనలు అందించి, చెల్లి తో రాఖీ కట్టించుకుని వారి ఇంట్లో ఆనందంగా, తృప్తిగా విందు భోజనం భుజించి చెల్లి కుటుంబాన్ని అన్న ఆశీర్వదించి రావడం, తరతరాలుగా జరుగుతోంది. ఇది సత్సంప్రదాయాలకు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి , ఆప్యాయత, అనురాగాలు కి ప్రతీక. కొన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి ఉమ్మడి కుటుంబం లో జరుపుకోవడం ఇప్పటికీ జరుగుతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమైనా అనురాగ ఆప్యాయతలతో రాఖీ పౌర్ణమి రోజు కుటుంబ సభ్యులంతా, ఒకే చోట అందరూ కలుసుకోవడం శుభపరిణామమే. నగరంలో వివిధ కూడళ్ళల్లో రాఖీ స్టాల్స్ లో సందడి: నగరంలో వివిధ కూడళ్ళల్లో రకరకాల రాఖీలతో దుకాణాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం రాఖీలు కూడా ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణంగా 20 రూపాయల నుండి లభించే రాఖీ కనీసం 50 రూపాయలు పెట్టనిదే మార్కెట్ లో దొరకడం లేదు. అయినా సందర్శకులు వారి స్థాయిని బట్టి 50 రూపాయల నుండి 1000 రూపాయల వరకు రాఖీలకు వెచ్చిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ రాఖీ పండుగ జరుపుకోవడం విశేషం. ఈసారి రాఖీ పండుగ బుధ , గురువారాల్లో వచ్చిందని రెండు రోజులు పండగే అని ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కానీ పండితులు నేడే రాఖీ పండుగ జరుపుకోవాలని సూర్యోదయం ఉన్న సమయంలో రాఖీ కడితే అన్న కుటుంబానికి శ్రేయస్సు, చెల్లి కుటుంబానికి సంక్షేమం, లభిస్తాయని అంటున్నారు. లెక్క ప్రకారం నేడే రాఖీ పండుగ అని పండితుల వాదం.దూర ప్రాంతాల నుండి వచ్చిన వారైతే ఈ రెండు రోజులు ఉత్సాహంగా రాఖీ పండుగ జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తన చెల్లి ఎంత దూరంలో ఉన్నా రాఖీ పండుగ రోజు చెల్లి ఇంటికి వెళ్లి అన్న రాఖీ కట్టించుకుని రావడం మరువడు. అనివార్య కారణాల వల్ల అన్నకి రాలేని పరిస్థితి ఏర్పడితే ఆ అన్న సుదూరప్రాంతాలలో ఉంటే ఆ చెల్లి అన్నకు కొరియర్ లో రాఖీ పండుగ రోజు రాఖీ పంపడం, సాంప్రదాయం. ఆ అన్నా ఆ చెల్లికి బహుమతిని కూడా ఫోన్ పే లో పంపి ఆశీర్వదిస్తాడు. ఇలాంటి సత్ సంప్రదాయాలు భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాబట్టే మానవత్వం, విశ్వజనీన ప్రేమ, చిరకాలం వర్ధిల్లుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక అయిన ఈ రాఖీ పండుగ విశిష్టమైన పండుగే ..!