కామెంట్లు కాక రేపాయి. వివాదం ముదిరి రోడ్డున పడింది. మంత్రి రోజాపై వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత గాలి భాను ప్రకాష్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు. కౌంటర్‌గా రోజా ఇంటి ముట్టడికి టీడీపీ కేడర్ బయల్దేరడంతో నగరిలో టెన్షన్ నెలకొంది. మంత్రి రోజాపై అభ్యంతర కర కామెంట్లతో ఏపీ లోని తిరుపతి జిల్లా నగరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంత్రి రోజాపై కామెంట్లతో నగరిలో ఉద్రిక్తత రాజుకుంది. అది కాస్తా టీడీపీ నేతపై వైసీపీ దాడులు, తర్వాత రోజా ఇంటి ముట్టడికి టీడీపీ కార్యకర్తల యత్నంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ నేత గాలి భాను ప్రకాష్.. రోజాపై కామెంట్లు చేయడంతో ఈ గొడవ మొదలైంది. దీంతో చిత్తూరు జిల్లా నగరి ఏరియా ఆసుపత్రి వద్ద టీడీపీ నగరి ఇన్చార్జ్ గాలి భానుప్రకాష్ కారుపై వైసీపీ నేతలు దాడి చేశారు. గాలి భాను కారును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని వాహనం అద్దాలు ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుచేసిన రైతులకు అన్నదానం కార్యక్రమానికి.. గాలి భాను వెళుతున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టిడిపి నేతల వాహనాలను అడ్డుకున్న వైసిపి కార్యకర్తలు.. భాను కారు అద్దాలు ధ్వంసం చేశారు. దాడి అనంతరంఘటనా స్థలం నుంచి భాను వెళ్లిపోయారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జనసేన, టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్..
కాగా గాలి భానుపై దాడి చేసిన వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని నగరి ఏరియా హాస్పిటల్ వద్ద టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. హైవేపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత మంత్రి రోజా ఇంటి ముట్టడికి టిడిపి కార్యకర్తలు ప్రయత్నించారు. రోజా ఇంటి వైపు పెద్ద సంఖ్యలో వెళుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని, ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. మరోవైపు జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. . కాగా టీడీపీ నేత లపై దాడిని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు కూడా ఆందోళన నిర్వహంచారు. పరిస్థితి మరింత చేజారకుండా పోలీసులు నగరి లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.