+ ఆదాయం ఘనం – అభివృద్ధి సూన్యం+ భలేరామస్వామి ఆలయం దుస్థితి
బలివే (నూజివీడు) (andhrapatrika) : ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ముసునూరు మండలంలోని బలివేలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వరస్వామి(భలేరామస్వా మి) ఆలయం అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తుంది. మహాశివరాత్రి పర్వదినానన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు జరిగే కల్యాణ మహోత్సవాలు(తిరునాళ్లు) అప్పుడే ఈ దేవాలయం పాలకులు, ఆలయ అధికారులకి గుర్తుకొస్తుంది. తిరునాళ్ల సందర్భంగా ఆలయానికి కృష్ణా, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల నుండి ప్రతి ఏడాది 3 లక్షల మంది భక్తులు భలేరామస్వామి దర్శనార్థం వస్తుంటారు, ప్రతి ఏడాది సుమారు 50 లక్షల పైబడి ఆదాయం ఆలయానికి వస్తుంది, అలాగే ఆలయ భూములు 26 ఎకరాల ద్వారా లక్షలాది రూపాయల కౌలు ఆదాయం వస్తున్నప్పటికి ఆలయ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంది. క్రీస్తు శకం 12 వ శతాబ్దంలో కాకతీయ ఆంధ్ర సామ్రాజ్య సేనాని నూజివీడు ప్రభువుల మూల పురుషుడు మేకా బసవ దండనాధుడు(బసవన్న) ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆనవాళ్లు చెపుతున్నాయి. ఆలయం దేవాదాయ పరిధిలోకి వచ్చి అర్ద శతాబ్దం కావస్తుంది అయినప్పటికీ ఆలయ ఏ మాత్రం నేటికి అభివృద్ధి చెందలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో నూజివీడు నియోజకవర్గ పరిదిలో ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం నూతన జిల్లా అయిన ఏలూరులో కొనసాగుతుంది. జిల్లా ఏదయినా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారయ్యింది. అతి పురాతమైన ఈ ఆలయం తిరునాళ్ల దేవుడిలా ప్రస్తుతం మారి పొయ్యింది. మహాశివరాత్రి తిరునాళ్లప్పుడు మినహా మిగతా రోజులలో ఈ ఆలయం గురించి పట్టించుకున్న పాలకులు లేరంటే అతి సయోక్తి కాదు. తిరునాళ్లప్పుడు అయినా ఆలయానికి వచ్చే భక్తులకు కనీస వసతులు కూడా ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు, భక్తులు కనీసం విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి విశ్రాంతి మందిరాల నిర్మాణం కూడా ఇక్కడ దేవస్థానం తరుపున ఏర్పాటు చెయ్యక పోవడం విశేషం. ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో పాటు పడిన రెండు సత్రాలు తిరునాళ్ల ప్పుడు ఆ మూడు రోజులు తెరుస్తారు అనంతరం మూసేసి తాళాలు వేసుకొని నిర్వహుకురాలు ఎటు వారు అటు వెళ్లి పోతుంటారు. ముసునూరు మండలం గోపవరం వాసి ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు శ్రీ రాజ రాజేశ్వరి ఆలయాన్ని 2012 వ సంవత్సరంలో ఈ ఆలయ ప్రాగణంలో నిర్మించడం జరిగింది.
తమ్మిలేరుపై వంతెన నిర్మాణం జరిగేనా
బలివే – విజయరాయి ఇరు గ్రామాలను కలిపే తమ్మిలేరుపై వంతెన నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉన్నప్పటికీ ప్రస్తుత పాలకులు కనీసం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. గత టిడిపి హయాంలో ఇక్కడి వంతెన నిర్మాణానికి 9 కోట్ల వరకు మంజూరు అయ్యిందని టిడిపి నాయకుడు అట్లూరి రమేష్ అప్పట్లో పత్రికా ముఖంగా ప్రకటనలు చేసి మంజూరు అయిన పత్రాలను సైతం ప్రదర్శించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వంతెన నిర్మాణానికి ఎటువంటి ముందు అడుగు పడలేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పెద్దలు వంతెన నిర్మాణం ఊసు కూడా ఎత్తక పోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తిరునాళ్లు వస్తునప్పుడల్లా తాత్కాలిక వంతెన పేరుతో 10 లక్షల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి తాత్కాలిక వంతెన నిర్మించడం అనేది గత 20 ఏళ్లుగా చేపడుతున్నారు. అయితే ఆ తాత్కాలిక వంతెన వర్షం కాలంలో వచ్చే వర్షాలకు తమ్మిలేటి ప్రవాహంలో కొట్టుకు పోవడం కథ మళ్లీ మొదటికి రావడం అనేది షరా మాములుగా జరిగే ప్రక్రియగా మారింది. తమ్మిలేటిపై శాశ్వత వంతెన లేకపోవడంతో బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అవుతున్నప్పటికి నేటికి ఆలయ కమిటీని వెయ్యలేదు. తిరునాళ్లు వచ్చినప్పుడల్లా ఉత్సవ కమిటి వేసి పాలకులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయ కమిటి లేక పోవడంతో ఆలయ అధికారులు తిరునాళ్ల సందర్భంగా వచ్చే తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకై వచ్చే ఆదాయం, కొబ్బరి చిప్పల వేలంపాటలు, ప్రసాదాల విక్రయాలు, హుండి ఆదాయం, తదితర ఆదాయం మొత్తం తిరునాళ్ల నిర్వహణ ఖర్చులకి, ఆలయ సిబ్బంది జీతాలకే అయిపోయినట్లు లెక్కలు చూపెడుతున్నట్లు ఆరోపిస్తున్నారు, సమాచార హక్కు చట్టం వర్తించదనే రీతిలో ఆలయ అధికారులు మాట్లాడటంతో ఆలయ ఆదాయ ఖర్చుల వివరాలు భక్తులకి తెలుసుకొనే అవకాశం లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆలయ భూములు 26 ఎకరాల ద్వారా ఆదాయం ఎంత వస్తుందనే వివరాలు బయటికి వెల్లడి కాని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం భక్తులలో నెలకొంది. ఆలయ భూములు, తిరునాళ్ల ఆదాయం అంతా ఖర్చులకే సరిపోతుంటే ఆలయ అభివృద్ధి ఏంటనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. దాతలు చేసిన అభివృద్ధి మినహా ప్రభుత్వం తరుపున చేసిన అభివృద్ధి సూన్యం అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహశివరాత్రి కళ్యాణమహోత్సవం సందర్భంగా జరిగే తిరునాళ్ళకి లక్షలలో భక్తులు వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు అనేవి ఏర్పాట్లు చెయ్యరనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణాలు లేవు, మహిళా భక్తులు తమ్మిలేటిలో స్నానం అనంతరం దుస్తులను సైతం మార్చుకోవడానికి అడ్డుగోడలను ఏర్పాటు చెయ్యడం అనేవి చోటు చేసుకోవడం లేదు. పితృ దేవతలకి తమ్మిలేటి ఒడ్డున పిండ ప్రధానాలు చెయ్యడానికి ప్రత్యేక స్థలం అనేది ఏర్పాటు కూడా చేయడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇంతేనని తిరునాళ్లు వస్తాయి అయి పోయిన తర్వాత హుండీ ఆదాయం లెక్కిస్తారు. ఆ ఆదాయంతో ఆలయ అధికారులు వేరే చోటకి హుడాయిస్తారు . అనంతరం మరలా మళ్ళి మహా శివరాత్రికి వచ్చినప్పుడు హడావుడి చేస్త్తారు. అంతే గాని ఆలయాన్ని అభివృద్ధి పరచడం గాని, తిరునాళ్లప్పుడు భక్తులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిద్దాం అనే కనీస ఆలోచనని సైతం ఆలయ అధికారులు చెయ్యరు, పాలకులు పట్టించుకోరు ఇది బలివేలోని బలే రామస్వామి ఆలయ దుస్థితి, ఇటువంటి కారణాలతోనే తిరునాళ్ల దేవుడిగా బలే రామస్వామికి పేరు పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ అభివృద్ధి మాకు సంబంధం లేదు: దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ : చెన్ను రంగారావు
ఆలయాల అభివృద్ధిని చేపట్టాలంటే దేవాదాయ శాఖ ద్వారా సాద్య పడదని ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చెన్ను రంగారావు అన్నారు. ఎక్కడ ఆలయం ఉంటే అక్కడి ఆలయం తరుపున వచ్చే ఆదాయం ఆ ఆలయానికే వెచ్చించాలన్నారు. బలివే ఆలయానికి వచ్చే ఆదాయం తిరునాళ్ల నిర్వహణకు, సిబ్బంది జీత బత్యాలకే సరిపోతుందన్నారు. అభివృద్ధి అనేది ప్రభుత్వం గాని, దాతలు గాని చెయ్యాల్సిందే గాని దేవాదాయ శాఖ ద్వారా చేసేది ఏమి ఉండదన్నారు. హైకోర్టు తీర్పు ఉత్తర్వుల మేరకు సమాచార హక్కు చట్టం అనేది దేవాదాయ శాఖకి వర్తించదని ఆయన స్పష్టం చేశారు.