- పవన్ కల్యాణ్ ట్విట్టర్ మాస్టర్
- ట్వీట్లు చేస్తే ప్రజల్లో ఉన్నట్లుగా భావన
- జనసేనానిపై మండిపడ్డ మంత్రి కొట్టు
అమరావతి,అక్టోబర్10(ఆంధ్రపత్రిక): పవన్ కల్యాణ్ ట్విట్టర్ మాస్టర్ అని.. షూటింగ్‌ల గ్యాప్‌లో ట్వీట్ చేస్తూ ఉంటారని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. పవన్‌కు రాజకీయ విలువలు లేవంటూ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తనకు తమ్ముడు అవుతారని.. పవన్ ట్వీట్ల ద్వారానే ప్రజలతో ఉన్నాను అనుకుంటారంటూ కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పవన్‌కు చంద్రబాబును నిలబెట్టుకోవాలని తాపత్రయ పడుతున్నాడన్నారు. తమ సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్‌ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. లోపాయకారి ఒప్పందాలు చేసుకుని వెళ్తే ప్రజల్లో ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం విూడియాతో మాట్లాడారు. ధార్మిక పరిషత్తు ద్వారా 5 ఆలయాలకు పాలక వర్గాల నియామకం చేసినట్లు తెలిపారు. 25 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం ఉన్న ఆలయాలకు పాలక మండళ్లు నియమించామన్నారు. రాష్ట్రంలోని మఠంలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం 20 వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వరూపానంద ఉద్యోగులు గొడవలు పడవద్దని సూచించారు. ఉద్యోగులు కోర్టులకు వెళ్లడం వల్ల ప్రమోషన్లు ఆగిపోతున్నాయని స్వరూపానంద పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ అలయంలో కూడా టిక్కెట్ ధరలు పెంచలేదని ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ వివరించారు. అమరావతి రైతుల పాదయాత్రపై కొట్టు సత్యనారాయణ తెలిపారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 600 మందితో యాత్ర చేయమంటే టీడీపీ వాళ్లు ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు పాల్గొంటున్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నామని కొట్టు సత్యన్నారయణ పేర్కొన్నారు.