మచిలీపట్నం అక్టోబర్ 16 ఆంధ్ర పత్రిక.
ప్రతి వారము కనీసం మూడు రోజులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ పి వెంకటరమణ, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్ర పర్యటన, రికార్డుల నిర్వహణ, జగనన్న ఆరోగ్య సురక్ష, సాగునీరు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు పర్యటించినప్పుడు చాలా సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయని, అవి పరిష్కారం కావడం లేదని ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రస్తావించడం జరిగిందన్నారు
ఈ నేపథ్యంలో ఇకపై జిల్లా అధికారులందరూ కనీసం మూడు రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.వారి పర్యటన వివరాలు సంబంధిత శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు ముందుగా తెలపాలన్నారు.
ఏ అధికారి ఏ గ్రామంలో పర్యటించారు అక్కడి సమస్యలు వివరాలను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలన్నారు.
కొన్ని మండలాల తహసిల్దార్లు వారి కార్యాలయంలో సరిగా రికార్డులు కానీ రికార్డు విభాగాలు గానీ నిర్వహించడం లేదని తెలుస్తోందన్నారు. ఒక వారం రోజుల లోపల వారు రికార్డులన్నీ సరైన పద్ధతిలో నిర్వహించాలని, ప్రతి ఒక్కటి జాబితా తయారుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠినంగా వ్యవహరించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంయుక్త కలెక్టర్, ఆర్డిఓలు తరచూ తహసిల్దారుల కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించాలన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు చాలా బాగా నడుస్తున్నాయన్నారు. రోజుకు సుమారు 500 నుండి 600 మంది ప్రజలు శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు.అంతమంది ప్రజలకు సానుకూల దృక్పథంతో ఎంతో ఓపిగ్గా వైద్య అధికారులు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.
వారిని బృంద సభ్యులుగా భావించివారి పట్ల గౌరవంతో మెలగాలన్నారు. వారికి కావలసిన రెఫ్రెష్మెంట్లు ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో సాగునీటిపై తరచూ ప్రతికూల వార్తలు వస్తున్నాయన్నారు. ఈ విషయమై సంబంధిత జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తనకు అందజేయాలన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎంత నీటి ప్రవాహం ఉంది, దిగువకు ఏ మేరకు విడుదల చేస్తున్నారో వాటి వివరాలు అన్నీ కూడా తెలియజేయాలన్నారు.