జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్నకు అలంకరించే తలపాగాకు శివరాత్రి వేడుకల్లో అత్యధిక ప్రాధాన్యం ఉంది.మహాశివరాత్రి లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి నిర్వహించే కళ్యాణోత్సవంలో ఈ తలపాగాతోనే శ్రీశైలం మల్లన్న ను వరునిగా అలంకరిస్తారు.
కాగా ఈ తలపాగాను నేయడం, మల్లన్న కు అలంకరించడం చేసేది చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పృద్వి వంశస్తులే. అనువంశికంగా వారికి ఈ అద్భుత అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆ వంశస్తుడైన పృథ్వి వెంకటేశ్వర్లు ఆ తలపాగాను నేసి మల్లన్నకు అందజేస్తున్నారు.
360 మూరల ఈ తలపాగా తయారీకి సంవత్సరకాలం పడుతుంది .రోజుకు మూరకు మించి వస్త్రాన్ని నేయలేరు. తలపాగా తయారీ సమయంలో వెంకటేశ్వర్లు కుటుంబీకులు పూర్తి నిష్టగా ఉంటారు.
తలపాగా తయారయ్యాక దానిని గ్రామంలో ఊరేగించి పృథ్వి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం చేరుకుంటారు.ఆలయ అధికారులకు తలపాగాను అప్పగిస్తారు. లింగోద్భవ సమయంలో దీపాలన్నీ ఆర్పేశాక వెంకటేశ్వర్ల చిమ్మ చీకటిలో దిగంబరంగా శిఖరం పైకి ఎక్కి ఈ తలపాగాను మల్లన్నకు చుట్టి వస్తారు.కల్యాణం ముగిశాక ఈ తలపాగాను వేలం వేస్తారు.భక్తులు లక్షలాది రూపాయలు పెట్టి దీనిని సొంతం చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
ఈ ఏడాది కూడా పృధ్వి వెంకటేశ్వర్లు తలపాగా నేసి శ్రీశైలం తీసుకువెళ్లారు.ఇటువంటి అరుదైన అవకాశం వెంకటేశ్వర్లు దక్కటం ఆయనకే కాకుండా చీరాల ప్రాంత వాసులు అందరికీ కూడా అదృష్టమనే చెప్పాలి