smriti Mandhana : సిరి మంధాన
అత్యధిక ధర దక్కిన టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్
కెప్టెన్ హర్మన్ కంటే ఎక్కువ ధరకు బెంగళూరు సొంతం
పలువురు విదేశీ క్రికెటర్లూ రూ.కోట్లకు కొనుగోలు
రూ.3.40 కోట్లతో స్మృతీ మంధాన జాక్‌పాట్
దీప్తిశర్మకు రూ.2.60 కోట్లు
హర్మన్‌ప్రీత్‌కు కోటీ 80 లక్షలే
విదేశీ కోటాలో ఆష్లే, స్కివర్ టాప్
ముగిసిన మహిళల ఐపీఎల్ వేలం
ఎడమచేతి వాటం డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన.. ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో కోట్లు కొల్లగొట్టింది. సోమవారం జరిగిన వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.3.40 కోట్ల అత్యధిక ధరతో.. స్మృతి మంధానను సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు రూ.2.60 కోట్ల ధర దక్కింది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు వేలంలో రూ.1.80 కోట్ల ధరే దక్కడం గమనార్హం. విదేశీ క్రికెటర్లలో నటాలి స్కివర్ బ్రంట్ (ఇంగ్లండ్), ఆష్లే గార్డనర్ (ఆస్ట్రేలియా) చెరో రూ.3.20 కోట్లు పలికారు.
ఇన్నేళ్లుగా ఐపీఎల్లో పురుష క్రికెటర్ల వేలాన్ని చూడడమే అలవాటుగా మారిన భారత ఫ్యాన్స్‌కు ఇదో సరికొత్త అనుభూతి. మహిళల ప్రీమియర్ లీగ్ కోసం తొలిసారి జరిగిన వేలంలో అమ్మాయిలపై కనకవర్షం కురిసింది. ఇందులో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే ఆమెను రూ.3.40 కోట్ల అత్యధిక ధరకు బెంగళూరు తీసుకుంది. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను మాత్రం రూ. 2 కోట్లలోపే ముంబై దక్కించుకుంది. విదేశీ క్రికెటర్లలో ఆల్‌రౌండర్లు ఆష్లే, స్కివర్‌లకు రూ. 3.20 కోట్ల చొప్పున పలకడం విశేషం.
ముంబై: ఎన్నాళ్లుగానో తమకూ ఓ లీగ్ కావాలని భారత మహిళా క్రికెటర్లు చేస్తున్న డిమాండ్‌కు అత్యంత కీలక ముందడుగు పడింది. బీసీసీఐ తొలిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) కోసం సోమవారం వేలం జరిగింది. దీంతో పురుష క్రికెటర్లకు దీటుగా వీరు కూడా మిలియనీర్లుగా అవతరించారు. అయితే విదేశీ స్టార్లను తలదన్నుతూ భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన జాక్‌పాట్ కొడుతూ, తొలి సీజన్లో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆమెను రూ.3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది. మొత్తంగా 20 మంది కనీసం రూ.కోటి జాబితాలో చేరి కోటీశ్వరులయ్యారు. అయితే పలువురు క్రికెటర్లకు అనూహ్యంగా నిరాశ ఎదురైంది. అలాగే ఫ్రాంచైజీల కోరిక మేరకు తుది జాబితాకు అదనంగా మరో 39 మంది ప్లేయర్లను కలపడంతో 448 మంది కోసం ఈ వేలం జరిగింది. ఇందులో 87 మందిని తీసుకోగా ఫ్రాంచైజీలు రూ. 59.50 కోట్లు వెచ్చించాయి. ఇదిలావుండగా ప్రస్తుతం టీ20 వరల్డ్‌క్‌పలో భాగంగా దక్షిణాఫ్రికాలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన ఈ వేలం ప్రక్రియను అత్యంత ఆసక్తిగా తిలకిస్తూ, తమకు దక్కిన ధరలతో సంబరాలు చేసుకున్నారు.
స్మృతి కోసం పోటాపోటీ: అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ వేలం తొలి సెట్లో మొదటగా పోటీ జరిగింది స్మృతి మంధానపైనే. రూ.50 లక్షల కనీస ధరతో ఆరంభమైన వేలం ఏకంగా రూ.3 కోట్లు దాటింది. అద్భుత షాట్లతో మెరుపు ఆరంభాలనందించే మంధాన కోసం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దూకుడుగా వెళ్లాయి. దీంతో రాకెట్ వేగంతో ధర పైపైకి వెళ్లింది. చివరికి ఆర్సీబీ పేర్కొన్న గరిష్ఠ ధరకు ముంబై వెనక్కి తగ్గడంతో బెంగళూరుకే మంధాన ఆడబోతోంది. ఆ వెంటనే ‘నమస్కార బెంగళూరు’ అనే ట్వీట్‌తో స్మృతి హర్షాన్ని వ్యక్తం చేసింది. అనంతరం ఈ సెట్లో ఆర్సీబీ.. ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ (రూ. 1.70 కోట్లు), కివీస్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ (రూ. 50 లక్షలు)ను కొనుగోలు చేసింది.
ఆష్లే, స్కివర్ జోరు: విదేశీ ఆల్రౌండర్లకు ఫ్రాంచైజీలు పెద్ద పీట వేశాయి. అందుకే ఆసీస్ స్టార్ ఆష్లే గార్డ్నర్కు రూ.3.20 కోట్ల ధర పలికింది. గుజరాత్ ఈమెను దక్కించుకుంది. ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్ కోసం ముంబై గట్టిగా పోరాడింది. ఢిల్లీ, యూపీ జట్ల పోటీని అధిగమిస్తూ రూ. 3.20 కోట్లు వెచ్చించింది. ఈ వేలంలో రెండో అత్యధిక ధర ఈ జోడీదే కావడం విశేషం. ఆ తర్వాత బెత్ మూనీ (గుజరాత్, రూ.2 కోట్లు), సోఫీ ఎకెల్‌స్టోన్ (యూపీ, రూ.1.80 కోట్లు) ఎలిస్ పెర్రీ (ఆర్సీబీ, రూ.1.70 కోట్లు), మారిజానే కాప్ (డీసీ, రూ.1.50 కోట్లు), తహ్లియా మెక్‌గ్రాత్ (యూపీ, రూ.1.40 కోట్లు), మెగ్ లానింగ్ (డీసీ, రూ.1.10 కోట్లు), అమెలియా కెర్ (ముంబై, రూ. కోటి) నిలిచారు. స్టార్ క్రికెటర్లు హీథర్ నైట్, సోఫీ డివైన్, సోఫియా డంక్లే, డియాండ్రా డాటిన్, అలీసా హీలీలకు రూ.కోటి లోపే పలకడం గమనార్హం.
హర్మన్‌కు తక్కువే..
మిడిలార్డర్లో కీలకంగా నిలిచే హర్మన్‌ప్రీత్‌కు కూడా భారీ ధర పలుకుతుందని ఆశించారు. కానీ విదేశీ ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీలు మాత్రం ఆచితూచి అడుగేశాయి. వేలంలో స్మృతి తర్వాత పేరు తనదే కాగా ఆర్సీబీ, ముంబై, యూపీ వారియర్స్, ఢిల్లీ జట్లు పోటీపడ్డాయి. చివరకు ముంబై రూ.1.80 కోట్లకు తీసుకుంది. తొలి సెట్లో ఈ జట్టు హర్మన్‌ను మాత్రమే కొనుగోలు చేసింది.
15 ఏళ్లకే లీగ్‌లో..
వేలంలో యంగెస్ట్ ప్లేయర్లుగా ఆంధ్ర పేసర్ షబ్నమ్ (గుజరాత్), లెఫ్టామ్ స్పిన్నర్ సోనమ్ యాదవ్ (ముంబై) నిలిచారు. 15 ఏళ్ల ఈ ఇద్దరినీ తమ కనీస ధర రూ.10 లక్షలకే జట్లు తీసుకున్నాయి. అలాగే 16 ఏళ్ల పర్షవీ చోప్రాను యూపీ వారియర్స్ తీసుకుంది.
యువ హవా
వేలానికి సరిగ్గా ఒక రోజు ముందే పాక్‌పై చెలరేగిన జెమీమా రోడ్రిగ్స్ పంట పండింది. ఇటీవలి కాలంలో పెద్దగా రాణించకపోయినా.. ఆమెకోసం జట్లు బాగానే పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల 20 లక్షలకు తీసుకుంది. అలాగే రెండో సెట్లో తొలి పోటీగా వచ్చిన ఆల్‌రౌండర్ దీప్తిశర్మపై దాదాపు అన్ని జట్లు బిడ్డింగ్ వేశాయి. ముంబైతో ఆఖరి వరకు పోటీ ఎదురైనా యూపీ వారియర్స్ రూ.2.60 కోట్లకు తీసేసుకుంది. ఇక అండర్-19 వరల్డ్‌క్‌పలో దుమ్మురేపిన షఫాలీ వర్మను డీసీ రూ.2 కోట్లకు, రిచా ఘోష్‌ను ఆర్సీబీ రూ. కోటీ 90 లక్షలకు తీసుకున్నాయి. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌పై ముంబై ఏకంగా రూ.1.90 కోట్లు వెచ్చించడం విశేషం. అలాగే లెఫ్టామ్ పేసర్ రేణుకా సింగ్‌కు రూ.1.50 కోట్ల (ఆర్సీబీ) ధర పలికింది.
తెలుగు క్రికెటర్లలో శర్వాణీ టాప్
మహిళల ఐపీఎల్ వేలంలో తెలుగమ్మాయి అంజలీ శర్వాణీ పంట పండింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు మహిళా క్రికెటర్లు వేలంలో పోటీపడగా.. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన శర్వాణీకి అత్యధిక ధర దక్కింది. కనీస ధర రూ. 30 లక్షలతో వేలం బరిలో నిలిచిన శర్వాణీని యూపీ వారియర్స్ జట్టు రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల శర్వాణీ.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచక్‌పలో ఆడుతున్న భారత జట్టులో శర్వాణీ సభ్యురాలు. ఇక, విశాఖపట్నం బ్యాటర్ ఊట్ల స్నేహదీప్తి, హైదరాబాద్ పేస్‌బౌలర్ అరుంధతీ రెడ్డిలను ఢిల్లీ జట్టు చెరో రూ.30 లక్షలకు, అలాగే విజయవాడకు చెందిన బ్యాటర్ సబ్బినేని మేఘనను గుజరాత్ టీమ్ అదే ధరకు తీసుకున్నాయి. ఇటీవలి అండర్-19 ప్రపంచక్‌పలో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులైన హైదరాబాద్ ఆల్‌రౌండర్ సొప్పదండి యశశ్రీ, విశాఖ బౌలర్ షబ్నమ్లను కనీస ధర రూ. 10 లక్షలకు యూపీ, గుజరాత్ జట్లు ఎంపికచేసుకున్నాయి. అయితే అదే ప్రపంచకప్‌లో సత్తాచాటిన హైదరాబాద్ బ్యాటర్ గొంగడి త్రిషను ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం.