ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి రాజధానిలో పనులు ఊపందుకోబోతున్నాయి. అదే సమయంలో రాజధానిలో మధ్య తరగతి ప్రజల కోసం గతంలో నిర్మించ తలపెట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ను కూడా ప్రభుత్వం తిరిగి చేపట్టబోతోంది.
ఇందుకోసం ఇప్పటికే సవరించిన అంచనాలు తీసుకున్న ప్రభుత్వం సీఆర్డీఏ సాయంతో దీన్ని పట్టాలెక్కించబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు తీసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
అమరావతి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టింది. అప్పట్లో అందులో 1200 ఫ్లాట్లను జీ18 విధానంలో 12 టవర్లుగా నిర్మించేందుకు ప్రణాళికలు చేపట్టింది. అయితే ఆ తర్వాత అధికారం వైసీపీకి మారడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఇప్పుడు మరోసారి అధికారం టీడీపీ చేతుల్లోకి రావడంతో తమ మానసపుత్రిక అయిన ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించబోతోంది. అయితే మధ్యలో వైసీపీ అధికారంలో ఉండగా ఇక్కడ పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ప్రకటించగానే జనం హాట్ కేకుల్లా ఇందులో ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. అప్పట్లో ఇందులో ప్లాట్లను గజం రూ.4049కే ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో అప్పట్లో 190 మినహా అన్ని ఫ్టాట్లూ బుక్ అయ్యాయి. కానీ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును వదిలేయటంతో అందులో అప్పటికే ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారంతా ఇరుక్కుపోయారు. వీరిలో 177 మంది వరకూ తమకు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని సీఆర్డీఏపై ఒత్తిడి తేవడంతో అప్పట్లో వీరు చెల్లించిన రూ.13 కోట్ల అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేశారు.వీటితో పాటు బుక్ కాని మరో 190 ఫ్లాట్లు ఉన్నాయి. వీటికి త్వరలో వేలం నిర్వహిస్తారు.
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అప్పట్లో రూ.770 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.930 కోట్లకు పెరిగింది. దీంతో ఫ్లాట్ల రేట్లు కూడా పెంచాల్సి ఉంది. కానీ అప్పట్లో ఫ్లాట్లు బుక్ చేసుకుని ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకోకుండా ఉన్న మిగతా ఫ్లాట్ ఓనర్లకు మాత్రం గతంలో ఉన్న రేటు చదరపు గజం రూ.4049కే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే నిర్మాణ వ్యయం పెరిగినా పాత రేటుకే వీరికి ఫ్లాట్లు ఇస్తారన్న మాట. దీంతో వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరించబోతోంది.