ఆయుర్వేదంలో వివిధ రకాల మొక్కలను అనారోగ్యాలకు నివారణగా వాడతారు. ఇలాంటి వాటిలో సదాబహార్ మొక్క ఒకటి. దీన్ని తెలుగునాట బిళ్ల గన్నేరుగా పిలుస్తారు.
ఈ మొక్కకు పుష్పించే పువ్వులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. చాలా ఇళ్ల పెరడులో దీన్ని షోకేస్ మొక్కగా పెంచుతుంటారు. ఈ మొక్క పువ్వుల్లో యాంటీఆక్సిడెంట్స్, సమ్మేళనాలు మెండుగా ఉండటంతో వాటిని ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తుంటారు. గన్నేరు పువ్వులను గ్లాస్ నీటిలో ఉడికించి కషాయం రూపంలో తాగవచ్చు లేదా బిళ్ళ గన్నేరు పువ్వులను నీడలో ఎండబెట్టి పొడి చేసి టీగా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.
* అదుపులోకి అధిక రక్తపోటు
అధిక రక్తపోటును నియంత్రించడంలో బిళ్ల గన్నేరు పువ్వులు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో విన్ఫోసెటైన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది హైబీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుంది. విన్ఫోసెటైన్ అనే సమ్మేళనం రక్త నాళాలను విస్తరించి రక్త సరఫరాను మెరుగుపర్చుతుంది. ఫలితంగా బీపీ నియంత్రణలోకి వస్తుంది.
* మధుమేహం నిర్వహణ
బిళ్ల గన్నేరు పువ్వుల్లో హైపోగ్లైసీమిక్ లక్షణాలతో కూడిన ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి మధుమేహం నిర్వహణలో ఔషధంలా పనిచేస్తాయి. శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. షుగర్ పేషెంట్లు రెగ్యులర్‌గా బిళ్ల గన్నేరు పువ్వుల కషాయం తాగితేనే ఈ ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మధుమేహం వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది.
* రోగనిరోధకశక్తి బలోపేతం
బిళ్ల గన్నేరు పువ్వుల్లో యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్ వ్యాధులకు చెక్ పెడతాయి. వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ను నివారిస్తాయి.
* క్యాన్సర్ కణాలపై పోరాటం
బిళ్ల గన్నేరు పువ్వుల్లోని విన్బ్లాస్టైన్, విన్‌క్రిస్టిన్ వంటి రసాయన సమ్మేళనాలు క్యాన్సర్ కణాలపై సమర్థవంతంగా పోరాటం చేసి క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. క్యాన్సర్ చికిత్సల్లో కీమోథెరపీ ఒకటి. ఈ చికిత్సలో విన్బ్లాస్టైన్, విన్‌క్రిస్టిన్ అనే రసాయన సమ్మేళనాలను వినియోగించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది.
* పీరియడ్స్ సమస్యల ఉపశమనం
హార్మోన్స్ అసమతుల్యం కారణంగా ఇటీవల కాలంలో చాలా మంది మహిళల్లో పీరియడ్స్ ఇరెగ్యులర్‌గా వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి బిళ్ల గన్నేరు పువ్వుల కషాయం తాగితే ఫలితం ఉంటుంది. కనీసం మూడు నెలల పాటు ఈ కషాయం తాగాలి. దీంతో పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంతో పాటు ఆ సమయంలో రక్త స్రావం చాలా వరకు తగ్గుతుంది.
* చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ
మధుమేహ రోగుల్లో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుదల రిస్క్ అధికంగా ఉంటుంది. అలాంటి వారు బిళ్ల గన్నేరు పువ్వుల కషాయం తాగితే అందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో చెడు కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడి హార్ట్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.