Best Cities for Public Transport: ప్రజా రవాణా ఒక నగరాన్ని అయితే గొప్పగా తీర్చి దిద్దుతుంది, లేదంటే విచ్ఛిన్నం చేస్తుంది. రోడ్లపై నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌తో మన దైనందిన జీవితానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతోంది.
సాధారణంగా ప్రజల ప్రయాణ అనుభవాన్ని సుగమం చేయడంలో నగరాలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, నగర ప్రయాణం అంటేనే నరకంలా మారిన అనేక నగరాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో గ్లోబల్ సిటీ గైడ్స్‌కు చెందిన టైమ్ అవుట్ అనే సంస్థ తాజాగా ప్రజా రవాణా అత్యుత్తమంగా ఉండే నగరాల జాబితాను విడుదల చేసింది.ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ నగరాల్లో దాదాపు 20,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేను విడుదల చేశారు. ఈ విషయమై టైమ్స్ ఔట్ ప్రతినిధులు మాట్లాడుతూ “ప్రజా రవాణా ద్వారా మీ నగరం చుట్టూ తిరగడం సులభమా? అని మేము ప్రజలను సూటిగా ప్రశ్నించాము”. ఐదుగురు స్థానికుల్లో నలుగురు తమ నగరంలోని ప్రజా రవాణా నెట్వర్క్ గురించి మంచి విషయాలు చెప్పారట. మరి నగరవాసుల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ఈ జాబితాలో టాప్-10లో ఉన్న నగరాలేవో చూసేద్దామా?
1. బెర్లిన్– జర్మన్ రాజధాని అయిన బెర్లిన్‌లో ప్రజా రవాణా బాగుందని 97 శాతం మంది బెర్లిన్ వాసులు చెప్పారట.
2. ప్రేగ్– ఐరోపాలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటైన ప్రేగ్లో సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉందట. ప్రేగ్ స్థానికులలో అత్యధికంగా 96 శాతం మంది తమ నగరాన్ని ప్రజా రవాణా బాగుందని తెలిపారు.
3. టోక్యో– ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన టోక్యోలో ప్రజా రవాణా స్థానికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా జపనీస్ మాట్లాడని వారికి కూడా అనుకూలంగా ఉంటుందట. దీనికి స్థానికులు 94 శాతం ఓట్లేశారు.
4. కోపెన్‌హగ్– కోపెన్‌హాగన్‌లో రైళ్లు, బస్సులు, వాటర్బస్సుల వ్యవస్థ బాగుంటుందట. అందుకే 93 శాతం మంది నగరవాసులు తమది బెస్ట్ అని ఓటేశారు.
5. స్టాక్‌హోమ్– స్టాక్‌హోమ్‌లోని ప్రజా రవాణాలో ట్రామ్‌లు, బస్సులు, ఫెర్రీలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. 93 శాతం మంది స్థానికులు గుడ్ అని చెప్పారు.
6. సింగపూర్– 92 శాతం మంది సింగపూర్ ప్రజలు తమ నగరంలో ప్రజా రవాణా బెస్ట్ అని చెప్పేశారు. అత్యాధునికమైన సౌకర్యాలతో సింగపూర్ రవాణా వ్యవస్థ చాలా సౌకర్యవంతంగా ఉంటుందట.
7. హాంకాంగ్– సమర్థవంతమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన రవాణాకు హాంకాంగ్ పెట్టింది పేరు. అందుకే 92 శాతం మంది నగరవాసులు గుడ్ అని తేల్చేశారు.
8. తాయిపేయి– ఆసియాలో అత్యంత సులభంగా ప్రయాణించే నగరాల్లో తాయిపేయి ఒకటి. అందుకే తాయిపేయిలోని 92 శాతం మంది స్థానికులు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను సానుకూలంగా రేటింగ్ చేశారు.
9. షాంఘై– ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన షాంఘైలో ప్రజా రవాణా పట్ల స్థానికులు సంతృప్తిగానే ఉన్నారు. 91 మంది షాంఘై వాసులు ప్రజా రవాణా బాగుందని చెప్పారు.
10. ఆంస్టర్దమ్– రైళ్లు, ట్రామ్‌లు, ఫెర్రీలు, బస్సుల నెట్‌వర్క్‌తో ఆమ్స్టర్డామ్ ప్రజా రవాణా అద్భుతంగా పని చేస్తుంది. అందుకే అక్కడి 91 శాతం మంది స్థానికుల ప్రజా రవాణాను మెచ్చుకున్నారు.
ఇకపోతే, ఈ జాబితాలో భారత ఆర్థిక రాజధాని ముంబైచోటు దక్కించుకోవడం గమనార్హం. ముంబై నగరానికి ఈ సర్వేలో 19వ స్థానం దక్కింది. ముంబైని దాటడానికి ప్రజా రవాణే సులభమైన మార్గమని 81 శాతం ముంబై వాసులు తేల్చి చెప్పారు.