– మోడీ పాలనలో అన్నీ అంబానీ.. ఆదానీలకే
– చల్లపల్లిలో సీపీఐ.. సీపీఎం ప్రచారభేరి
చల్లపల్లి, ఏప్రిల్ 27 (ఆంధ్రపత్రిక): దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టబెడుతూ ఆ భారాన్ని పేద ప్రజలపై మోపుతున్న మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో అంబానీ ఆదానీలకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, సీపీఐ జిల్లా నాయకులు హనుమానుల సురేంద్ర నాధ్ బెనర్జీ తెలిపారు. ‘బిజెపిని సాగనంపుదాం… దేశాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు చేపట్టిన ప్రచార భేరి గురువారానికి చల్లపల్లికి చేరింది. ఈ సందర్భంగా చల్లపల్లి ప్రధాన సెంటర్లో జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు.. సిపిఐ నాయకులు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ప్రజలందరికీ మంచి చేస్తానని, మంచి రోజులు తీసుకువస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రజలను వంచించారని తెలిపారు. 9 ఏళ్ల మోడీ పరిపాలనలో ఆదాని.. అంబానీలకు మాత్రమే మంచి రోజులు వచ్చాయని పేద ప్రజలకు మంచి రోజులు రాలేదని తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారంగా మారేలా ధరల పెరుగుదల ఉందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు ఇలా అన్ని ధరలు పెరిగిపోయనీ రూ.430 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1150 పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దేశంలో రైతాంగం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోందనీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక వర్గాలకు మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు వూడిగం చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో ఆదాని ఆస్తి 50వేల కోట్లు అయితే తొమ్మిదేళ్ల మోడీ పాలనలో 16 లక్షల కోట్లకు ఆస్తి పెరిగిందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, మహిళలకు.. మైనార్టీలకు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ రాష్ట్రాల్లో బిజెపి యేతర ప్రభుత్వాలను పడకొట్టడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్ట పెడుతూ మతోన్మాద పోకడలతో లౌకికవాదుల అణచివేత లక్ష్యంగా సాగుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు ఆయా పార్టీల నేతలు యద్దనపూడి మధు, వాకా రామచంద్రరావు, ఎండీ. కరీముల్లా, బండి ఆదిశేషు మల్లుపెద్ది బోసు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.