Mango village : ఆ ఊరి నిండా నోరూరించే మామిడి పండ్ల మజానే!

ఒక మామిడి పండు (Mango) కొబ్బరి కాయంత పెద్దగా ఉంటుంది.. మరొకటి ఉసిరికాయంత చిన్నగా ఉంటుంది.
ఇంకో మామిడి పండు తింటే తేనెలాంటి తియ్యదనం జిహ్వకు తగులుతుంది. మరో మామిడి పండు కొరికితే అందులోని పుల్లదనం బుగ్గకు చక్కలిగింత పెడుతుంది. ఇన్ని రకాల గురించి చదువుతుంటేనే నోరూరిపోతోంది కదూ! కేరళ (Kerala) రాష్ట్రం కన్నూర్ జిల్లా కన్నాపురం గ్రామంలో ౨౦౦కు పైగా వెరైటీ మామిడి పండ్లు (Mangoes) కాస్తున్నాయట మరి.
కన్నాపురం ఓ చిన్న పల్లెటూరు. ఇక్కడ ౨౦౭ రకాల దేశవాళీ మామిడిపండ్లు కాస్తున్నాయి. ఈ గ్రామ పరిధిలోని కురువాక్కవు అనే చిన్న ప్రదేశంలోనే ౩౮౨ చెట్లకు ౧౦౨ వెరైటీ మామిడి కాయలు వేలాడుతుంటాయి. అందుకే ‘కేరళ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు’ కురువాక్కవును ‘దేశవాళి మామిడి వారసత్వ ప్రాంతం’గా ప్రకటించింది. ఈ అరుదైన చెట్లను కాపాడుకోవడం వెనుక ౨౦ కుటుంబాల కృషి, ఓ పోలీసు అధికారి తపన ఉంది.
ఒక్క చెట్టు నరికేశారని తెలిసి..
కన్నాపురం గ్రామానికి చెందిన శైజు మఛాతికి చిన్నప్పటి నుంచే మామిడి పండ్లంటే అత్యంత ఇష్టం. అప్పట్లో ప్రత్యేకంగా మామిడి పండ్లను మార్కెట్కు తరలించి అమ్మేవారు కాదు. వేసవి కాలం సెలవులొస్తే శైజు మామిడి చెట్ల చుట్టూ తిరుగుతుండేవాడు. పండ్లను కోసి ఇంట్లో వారికి, బంధువులకు పంచి పెడుతుండేవాడు. ఆయన తల్లిదండ్రులు వరి పండించేవారు. చదువు పూర్తయ్యాక శైజుకు పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది. ఇలా ఉండగా ౨౦౧౬లో ఒకసారి ౨౦౦ ఏళ్లనాటి ‘వెల్లత’ రకానికి చెందిన చెట్టును కొట్టేశారని శైజు తన స్నేహితుడి ద్వారా విన్నాడు. మరుసటి రోజు ఓ వ్యవసాయ అధికారిని వెంటబెట్టుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు. అంటు కట్టే పద్ధతి ద్వారా ఆ చెట్టు రకాన్ని కాపాడుకోవచ్చని తెలిసి ఆ దిశగా ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు. తన చుట్టుపక్కల వారికీ ఆ రకం మొక్కలను పంపిణీ చేశాడు. స్థానిక వార్తాపత్రికలు దీని గురించి ప్రచురించడంతో శైజుకు మరింత ఉత్సాహం వచ్చింది. అరుదైన మామిడి రకాల సంరక్షణ వైపు అడుగులు వేశాడు. ఆ మరుసటి ఏడాది ౩౬ మామిడి రకాలను గుర్తించి డాక్యుమెంట్ చేశాడు. ఈ పనికి అతడి స్నేహితులు, వ్యవసాయ శాఖ అధికారులు సహకారం అందించారు. అలా కొద్ది రోజులు గడిచే సరికి అక్కడ నివాసం ఉన్న వారంతా తమ పెరట్లో ఎన్ని రకాల మామిడి పండ్లు సాగవుతున్నాయో తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వాటిని సంరక్షించేందుకు తమ వంతు కృషి చేయడం మొదలెట్టారు.
‘మే’లో మ్యాంగో ఫెస్ట్
నాటికి ఈ ప్రాంతంలో మొత్తం వంద మామిడి రకాలను గుర్తించారు. రంగు, తొక్క, పీచు, గుజ్జు, ఆకులను బట్టి వాటిని విశదీకరించారు. దాంతో అరుదైన మామిడి రకాలు దొరికే చోటుగా ఈ ఊరికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అందుకే ఏటా మే నెల తొలి ఆదివారం ఇక్కడ ‘మ్యాంగో ఫెస్ట్’ నిర్వహిస్తున్నారు. అన్ని రకాల మామిడి పండ్లు, వాటితో వివిధ వంటకాలు తయారు చేసి ఆ రోజున ప్రదర్శిస్తారు. ఆ సందడిని చూసేందుకు ప్రముఖులు, చుట్టుపక్కల గ్రామస్థులు కూడా తరలివస్తుంటారు. ఫెస్ట్ సందర్భంగా గ్రామస్థుల మధ్య పండ్ల గురించి చర్చలు సాగుతాయి. చెట్లను కాపాడుకోవడానికి భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారు.