అక్షరాస్యతా రాష్ట్రంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…!
అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్నదే సంకల్పం…! ఆ దిశగా అడుగులు వేస్తున్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్…! ఆచరణలో ఎంతవరకు ఫలించేనో? మచిలీపట్నం ,
జూలై 26 ఆంధ్ర పత్రిక. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆశయం, సంకల్పం, ఉద్దేశ్యం, మంచివే కానీ ఆచరణలో ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల దశ ,దిశ మార్చి నూతన సంస్కరణలకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కూడా అడుగులు వేస్తోంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కార్యక్రమం విజయవంతం చేయడానికి తన సర్వశక్తులు వడ్డుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పాఠశాలను, కళాశాలను అప్రమత్తం చేశారు. సుడి గాలి పర్యటనలు చేస్తూ విద్యాశాఖను చైతన్య పరుస్తున్నారు.బడి మానిన, బడి బయట పిల్లల్ని గుర్తించి బడిలో చేర్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 5 నుండి 18 సంవత్సరాల లోపు గల పిల్లల్ని బడిలో చేర్పించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు , డీఈవోలు, ఉప విద్యాశాఖ అధికారులు,మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పని చేయాలని , ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణాజిల్లాలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆధ్వర్యంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించడం జరుగుతోంది. రాజాబాబు తరచూ విద్యాశాఖ తో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేసి, విధిగా అందరూ బడిలో చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలన్ని సుడిగాలి పర్యటన చేస్తూ, ఉపాధ్యాయులను చైతన్యం చేయడం జరుగుతోంది. కానీ కొన్నిచోట్ల పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పర్యటనల వల్ల, జిల్లా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులలో అలజడుల సునామీ ప్రారంభమైంది. విద్యార్థులు శ్రవణ, భాషణ, పఠన, లేఖన నైపుణ్యాలలో చక్కని తర్ఫీదు పొందాలన్నది విద్యాశాఖ ముఖ్య లక్ష్యం. ఆ లక్ష్యం మేరకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉపాధ్యాయులకు ఆధునిక పద్ధతుల్లో శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులనైనా ప్రధానోపాధ్యాయులనైనా అధికారులనైనా, ప్రజానీకం ముందు, అగౌరవ పరచకూడదు అన్నదే ఉద్యోగస్తుల అభిప్రాయం. లోటుపాట్లు ప్రతి చోటా ఉంటాయి అన్నది, వారి అభిప్రాయం. ఏది ఏమైన ఉన్నతాధికారులు పాఠశాలల సందర్శనలో లోటు పాట్లు ఏమైనా గమనిస్తే సంబంధిత అధికారులకు ఉపాధ్యాయులకు, ప్రజా సమక్షంలో కాకుండా ప్రత్యేకంగా తెలియజేయాలని, మరోమారు తమ సందర్శనలో తప్పులు గమనించిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని చెబితే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. చర్యలు తీసుకునే విధానాలు , అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పల్స్ జి.ఈ. ఆర్: ఈ కార్యక్రమం 100 రోజులు పూర్తయిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా బడి మానిన,బడి బయట పిల్లల్ని గుర్తించి బడిలో చేర్పించడమే లక్ష్యంగా అడుగులు వేయడం ప్రధాన ఉద్దేశ్యం. కార్యక్రమ లక్ష్యం అభినందించదగ్గ విషయమే . అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థుల సమాచారం రికార్డు చేసి విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% పూర్తి చేయాలి. ఖచ్చితంగా బడిలోనే ఉండాలి అన్నది,జగనన్న ప్రభుత్వ సంకల్పం. ఆ లక్ష్య దిశగా విద్యా శాఖ చేస్తున్న కృషి అనన్య సామాన్యం. సెప్టెంబర్ 2005 , సెప్టెంబర్ 2018 మధ్య , జన్మించిన పిల్లల్ని పాఠశాల, కళాశాలలో, నమోదు చేయించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. 2023 – 24 విద్యా సంవత్సరంలో అందరూ బడిలో చేరాలి అనే లక్ష్యంతో, ఇప్పటికే 2.4 లక్షల మంది వాలంటీర్లు, ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించడం జరిగింది. ఇంకా బడిలో చేర్చవలసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది ఉన్నట్లుగా తెలిసింది. వలస కార్మికులు, సంచార జీవులను కూడా గుర్తించి వారిని కూడా బడిలో చేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థి సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత ఫిజికల్ రిజిస్టర్ లో నమోదు చేసి పోర్టళ్ళ లో అప్లోడ్ చేసే విధంగా ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. పాఠశాల సెన్సెస్ ప్రక్రియ కూడా పారదర్శకంగా నిర్వహించాలి అని కృష్ణాజిల్లా డిఇఓ తాహేరా సుల్తానా ఇప్పటికే అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ మేరకు ప్రధానోపాధ్యాయులు బాధ్యతాయుతంగా ప్రతి విద్యార్థిని పాఠశాలలో చేర్చేలాగా చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. పిల్లలు ఉండవలసింది పనిలో కాదు, బడిలో ఉండాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. పేదరికం అజ్ఞానం,నిరక్షరాస్యత వల్ల ఇప్పటికీ బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం పిన్న వయసు నుండి పిల్లల్ని పనిలోకి పంపడం. ఇటుక బట్టీల్లో, ఖార్ఖానాల్లో బాల్యం మగ్గిపోకుండా ఉండాలి. ఈ జగమంతా పోనీ, యవ్వనమంతా పోనీ, ఈ నాటి జీవితం అంతా పోనీ, ఆనాటి బాల్యాన్ని ఒకసారి రాని అన్న కవి స్పందనను బట్టి భవ్యమైన బాల్యాన్ని దివ్యముగా , సవ్యంగా తీర్చిదిద్ద వలసిన బాధ్యత అందరిపై ఉంది. ఒక్క జిల్లా విద్యాశాఖ మాత్రమే గాక , కార్మిక శాఖ కూడా పటిష్టంగా పనిచేస్తూ బాల కార్మికుల్ని గుర్తించి వారిని బడిలో చేర్చే బాధ్యత తీసుకోవాలి. భద్రమైన భవితను అందించవలసిన బాధ్యత అందరిపై ఉంది.ప్రభుత్వ లక్ష్యం, ఆశయం, సంకల్పం, నెరవేరాలంటే బాల బాలికలందరూ బడిలో చేరేలాగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రక్రియని పాఠశాల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ దిశగా అందరూ అడుగులు వేస్తారని ఆశిద్దాం…!