అధ్యక్షుడి చేతిలోనే సీడబ్ల్యూసీ ఎంపిక
ప్లీనరీకి సోనియా, రాహుల్ దూరం..
సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలపండి
రాయ్‌పుర్, ఫిబ్రవరి 24 : దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోన్న కాంగ్రెస్ తాజా ప్లీనరీ సమావేశాల్లో వాటిపై కసరత్తు మొదలుపెట్టింది.మూడు రోజులపాటు నిర్వహించనున్న 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో ప్రారంభ మయ్యాయి. ఇందులో భాగంగా పార్టీ స్టీరింగ్ కమిటీ ఈ ఉదయం సమావేశమైంది. సీడబ్ల్యూసీ సభ్యులను పార్టీ అధ్యక్షుడే ఎన్నుకునేలా ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే, ఈ కీలక సమావేశానికి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు మాత్రం హాజరు కాలేదు. ఈ సాయంత్రం వారు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సీడబ్ల్యూసీ ఎంపిక పార్టీ అధ్యక్షుడి చేతిలో..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశమైన కీలకమైన స్టీరింగ్ కమిటీ.. మూడు రోజుల సమావేశాల అజెండాకు తొలుత ఆమోదం తెలి పింది. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన ఖర్గే.. సీడబ్ల్యూసీ ఎన్నిక నిర్వహించడంపై సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలపాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సభ్యులు దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ సీడబ్ల్యూసీ సభ్యులను పార్టీ అధ్యక్షుడు నామినేట్ చేసేలా స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ వెల్లడిరచారు. పార్టీకి చెందిన మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్ర పతులకు వర్కింగ్ కమిటీలో చోటు ఉండేలా పార్టీ నిబంధనల్లో సవరణ చేసేందుకు కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికలు అవసరం లేదని సీనియర్లు.. ఉండాలని జూనియర్లు డిమాండ్ చేస్తున్న తరుణంలో సీడబ్ల్యూసీ ఎన్నికల అంశం పార్టీలో ప్రాధాన్యం సంతరించుకుంది. చివరిసారిగా 1997లో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ నిర్వహించడం ద్వారా.. ఆ రాష్ట్రంతోపాటు, పక్కనున్న మధ్యప్రదేశ్, తెలంగా ణల్లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ భరోసాతో 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందుకోసం భావసారూప్య పార్టీలతో జట్టుకట్టే అంశంపైనా ప్లీనరీలో మేధోమథనం సాగించనున్నారు. ఈ ప్లీనరీకి కాంగ్రెస్ అగ్రనాయకులతోపాటు సుమారు 15వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం.