మచిలీపట్నం, డిసెంబర్ 5 ఆంధ్ర పత్రిక.
మిచౌమ్గ్ తుఫాన్ ప్రభావం వల్ల బందరు నగరం చిగురుటాకులా వణికింది. ప్రధాన రహదారులు సైతం చెరువులు తలపిస్తున్నాయి. కోనేరు సెంటర్, రేవతి సెంటర్ బస్టాండ్ సెంటర్, జిల్లా కోర్టు సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్, ఇలా ప్రతి ప్రాంతము పూర్తిగా జలమయమై బందరు నగరం చెరువును తలపిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. చలిగాలుల తీవ్రత వల్ల చంటి పిల్లలు ,వృద్దులు సైతం చలికి విలవిల లాడుతున్నారు. ద్విచక్ర వాహనాలు ముందుకు సాగక మొరాయిస్తున్నాయి.
నగరంలోని ప్రధాన రహదారులన్నీ భారీ వర్షానికి పూర్తిగా జలమయ్యమవడంతో జన జనజీవనం స్తంభించింది.ఎక్కడ నుయ్యో, ఎక్కడ గొయ్యో అన్నట్లుగా పరిస్థితి ఉంది.
తుఫాను బాపట్ల దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తుఫాన్ దాటికి , భారీ వర్షాలకు ప్రధాన రహదారులే కాదు పల్లపు ప్రాంతాలు కూడా పూర్తిగా నీటిలో తడిసి ముద్దయ్యాయి. గత నాలుగు రోజులుగా చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యాపారాలు నడవక పస్తులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని పౌరులు, ఇల్లు దాటి బయటకు వెళ్లాలంటే భయాందోళనలకు గురి అవుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి.
తుఫాన్ గాలులకు హోర్డింగులు విరిగి, విద్యుత్ స్తంభాలపై పడటం వల్ల విద్యుత్తుకు అంతరాయం కలుగుతోంది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు కూడా విరిగి పడుతున్నాయి. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలో,జిల్లాలో తుఫాన్ ప్రభావం వల్ల గత రెండు రోజుల నుంచి పాఠశాలలకు, కళాశాలలకు, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించడం జరిగింది.
నారాయణపురం, ఈడేపల్లి, తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. కొజ్జిల్లి పేట నాగేశ్వర స్వామి దేవాలయంలోకి నీరు ప్రవేశించడంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇటీవల కాలంలో ఇంతటి భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవని ప్రజానీకం చర్చించుకోవడం గమనార్హం. తుఫాన్ తీరం దాటాక మరో 24 గంటలు పాటు భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితులు ఇంకెంత తారుమారవుతాయోనని ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
అప్రమత్తమైన జిల్లా అధికారులు:
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు పూర్తిగా అప్రమత్తమై ప్రజ లకు, పశువులకు, ఎవ్వరికీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అధికార పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు, పల్లపు ప్రాంతాలు పర్యటించి ప్రజల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
తుఫాను వర్షము వీడినా నగరంలో పరిస్థితి చక్కబడడానికి కనీసం వారం పడుతుంది. వర్షం తగ్గిన అనంతరం వర్షపు నీరు డ్రైనేజీల ద్వారా బయటకు పోయే ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలి. అలాగే పల్లపు ప్రాంతాలలో నీటిని కూడా తోడించి ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించే ఏర్పాటు చేయాలి. నగరంలో దోమలవ్యాప్తి వృద్ది చెందకుండా దోమల మందు పిచికారి చేయించాలి. నగరపాలక సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలి. బస్టాండ్ పరిసరాలు అయితే పూర్తిగా అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. ఏది రోడ్డు, ఏది గొయ్యో తెలియని పరిస్థితి దాపురించింది.
నగరపాలక సంస్థ అధికారులు వ్యాధులు వ్యాపించకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలి. పారిశుద్ద్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
అప్పుడే భారీ వర్షాల ద్వారా ఏర్పడే అనారోగ్యాలను, అరికట్టిన వాళ్ళం అవుతాం. శుభ్రత, పరిశుభ్రత, పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులపై ఉంద నడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ దిశగా నగరపాలక సంస్థ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లు నిర్వహించి పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం..!