భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
మైక్‌తో పోలీసుల ప్రచారం
అజిత్‌సింగ్‌నగర్(మధురానగర్), న్యూస్‌టుడే: బుడమేరుకు మళ్లీ వరద వస్తోందంటూ శనివారం సామాజిక మాధ్యమాల్లో జరిగిన విస్తృత ప్రచారం విజయవాడ అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంత వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
నందమూరినగర్-అంబాపురం మధ్య ఇన్నర్ రింగ్‌రోడ్డుకు గండి పడిందంటూ పలువురు యువకులు ద్విచక్ర వాహనాలపై కేకలు వేయడంతో ఒక్కసారిగా జనం ఉలిక్కిపడి భయపడిపోయారు. దీంతో నున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ కృష్ణమోహన్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి గండి పడిందంటూ వచ్చే వదంతులను నమ్మవద్దని మైక్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుడమేరుకు వరదలు వచ్చి రెండు వారాలు గడిచినా అంబాపురంలో వరద నీరు తగ్గలేదు. దీంతో అధికారులు ఇన్నర్ రింగ్‌రోడ్డుకు గండి కొట్టి వరద నీటిని మళ్లించారు. ఈ నీటిలో కొంత రాధానగర్, ఉడా కాలనీ వైపు రావడంతో బుడమేరుకు వరద అంటూ ప్రచారం జరిగింది. ఇవి కేవలం వదంతులేనని అధికారులు రోడ్డుకు గండి కొట్టి బుడమేరు వరదను మళ్లిస్తున్నారని తెలియడంతో జనం హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
స్పందించిన పురపాలక శాఖ మంత్రి
గండి అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడంతో మంత్రి పి.నారాయణ స్పందించారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో మాట్లాడారు. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని వీటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ డాక్టర్ జి.సృజన, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తదితరులు ప్రజలు భయపడవద్దని అవన్నీ తప్పుడు ప్రచారమన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, సీపీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గండిపడిదంటూ ద్విచక్ర వాహనాలపై కేకలు వేస్తూ ప్రచారం చేసిన కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.