మచిలీపట్నం డిసెంబర్ 8 ఆంధ్ర పత్రిక.
జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు పేరుకే కన్వెన్షన్ హాలుగా మిగిలింది. వసతులు మాత్రం మృగ్యంగా ఉన్నాయని ప్రజానీకం చర్చిస్తున్నారు. కాస్త వర్షం వస్తే చాలు, వర్షం తగ్గి రెండు రోజులైనా మోకాల్లోతు నీళ్లలో కన్వెన్షన్ హాల్ కి వెళ్లే రహదారి దర్శనం ఇస్తుంది.
మొన్నటి వరకు తుఫాను వల్ల బందరు నగరం వర్షపు నీటిలో తడిసి ముద్దయింది. నిన్నటి నుండి కాస్త పరిస్థితులు చక్కబడ్డా పల్లపు ప్రాంతాలు ఇంకా జలమయంగానే ఉన్నాయి.
ముఖ్యంగా జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో వివాహ వేడుకలు, పదవీ విరమణ వేడుకలు ఇలా సందర్భాన్ని బట్టి వివిధ రకాల వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఏసీ ఫంక్షన్ హాల్ అవడంవల్ల అద్దె కూడా లక్షకి పైగా ఉంటుంది. కానీ సౌకర్యాలు, వసతులు మాత్రం అంతంత మాత్రమే నని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్న వాళ్లు అనుకోవడం రివాజు.దానికి తోడు దోమల బెడద, దుర్వాసన షరా మామూలే. నగరంలో ఫంక్షన్ హాల్స్ పెళ్లిళ్లకు, వేడుకలకు భర్తీ అయిపోయాక చివరికి ఏది దొరక్క గత్యంతరం లేక ఇలాంటి ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోవలసిన దుర్గతి ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. నిర్వహణా పని తీరు, సిబ్బంది లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బతుకు జీవుడా అని పెళ్లిళ్లకు వచ్చిన వాళ్ళు, పనుల మీద వచ్చిన వాళ్ళు, ఉద్యోగులు బురద నీటిలో ఈదుకుంటూ రావలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. సొమ్ము పోయే, శని పట్టే అన్నట్టుగా ఉందని ఆందోళన చెందుతున్నారు. సౌకర్యాల లేమి తో కొట్టుమిట్టాడుతున్న జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ ని, ఫంక్షన్ హాల్ కు వెళ్లే రహదారిని సంస్కరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జిల్లా పరిషత్తులో నిధుల లేమో , లేక అధికారుల అశ్రద్ధయో? కారణమేమో తెలీదు కానీ, ఎంతో ఉన్నత ఆశయంతో కట్టిన ఫంక్షన్ హాల్ రహదారి ఇలా నిర్జీవ కళతో తాండవిస్తోంది అని ప్రజానీకం అనుకోవడం గమనార్హం.
పెళ్లిళ్లకు, వేడుకలకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఆడ పెళ్ళివారు ఆడంబరంగా వివాహ వేడుకలు నిర్వహిస్తారు.ఇలా ఫంక్షన్ హాల్ కి వెళ్లే రహదారి బురద నీటిలో మగ్గి ఉంటే ఆ ఇంట పెళ్లి కళ ఎక్కడుంటుంది? అని ఆవేదన చెందుతున్నారు. కన్వెన్షన్ హలు పరిసరాలు పాత కళతో దర్శనమిస్తోంది.
పెళ్లిళ్లకు వెళ్లాలన్నా, జనం తటాకం ని మరిపించే బురద నీరు చూసి పెళ్లికి వెళ్లే ఆలోచన విరమించుకోవడం జరుగుతోంది. తప్పనిసరిగా వెళ్లాలి అనుకున్న వాళ్ళకి పెళ్లిళ్లకు బురద నీటిలో ఈదుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ బురదలో వెళ్లే కన్నా పెళ్లికి వెళ్లడం మానుకోవడమే ఉత్తమం అని చాలామంది పెళ్ళికి, వేడుకలకు హాజరు కాకుండా దూరంగా ఉండడం కనిపిస్తోంది. పెళ్లి చేసే నిర్వాహకులు, బంధుమిత్రులకు, ఈ తిప్పలు తప్పవు కాబట్టి ఇలా బురద నీటిలోనే ఈదుకుంటూ పెళ్లిళ్లకు వెళ్లాల్సిన దుస్థితి వాటిల్లుతోంది. ఫంక్షన్ హాలు పరిసరాలు, జిల్లా పరిషత్ ప్రాంగణం సైతం ముంపు భారిన పడ్డాయి. పూర్తిగా ముంపుకు గురైనపల్లపు ప్రాంతాన్ని కనీసం మెరక చేయించి మురుగునీరు పోయేలాగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడటం లేదని పెళ్ళిళ్లకు వచ్చే బంధు మిత్రులు ఆవేదన చెందుతున్నారు. అదీకాక చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణ ఉండడం వల్ల ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది కొరత కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది..!
పెళ్లిళ్లు నిర్వహించే కుటుంబ సభ్యులు ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి వేడుకగా చేసుకునే ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశిస్తారు. ఇలా బురదమయమైన రహదారిని చూసి వేడుకలకు వచ్చినవాళ్లు బావురు మంటున్నారు. ఏ తీరుగమము దయ చూచెదవో, అంటూ కన్వెన్షన్ హాల్ కి వెళ్ళే రహదారులు భోరున విలపిస్తున్నాయి. అంతే కాదు పక్కనే ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయం కూడా బురద నీటిలో మగ్గుతొంది. జిల్లా పరిషత్ అధికారులకు ఈ రహదారి తీరుతెన్నులు కనపడలేదా? లేక మొద్దు నిద్ర నటిస్తున్నారా? అని ప్రజానీకం గుసగుసలాడుకుంటున్నారు.
ఇప్పటికైనా జిల్లా పరిషత్ అధికారులు, కన్వెన్షన్ హాల్ కి వెళ్లే రహదారిని సంస్కరించి ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తారని, పెళ్లిళ్లు, ఫంక్షన్స్ నిర్వహించే వారికి అసౌకర్యం కలగకుండా చూస్తారని ఆశిద్దాం..!